విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్
బెంగళూరు : కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ఒక పెద్ద కుట్ర అని విలక్షణ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. ఎస్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ పౌరులుగా ఓటు హక్కు కలిగిన వారు ప్రతిసారీ తమ అర్హతను నిరూపించుకోవాల్సిన అవసరమేమిటని ఆయన నిలదీశారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో 'యాంటీ-ఎస్‌ఐఆర్ కర్ణాటక' వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 'ఎలక్షన్ కమిషన్ ఛలో' కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ప్రసంగించారు. 'ఆధార్ సహా అవసరమైన గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ పౌరులను అనుమానంతో చూడటం సరికాదు. మేం దొంగలం కాదు. మేము కూడా ఈ దేశ పౌరులం. మా హక్కుల కోసం పోరాడు తున్నాం. భారత్ మా ఇల్లు. మేం ఇక్కడే పుట్టాం. మళ్లీ ఈ దేశానికి చెందిన వారమని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది' అని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు బెంగళూరు లోని విజయనగర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నరసింహయ్య కాలనీలోని ఓ పోలింగ్ బూత్‌ను ప్రకాశ్‌రాజ్ సందర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో మాట్లాడారు. ఈ సవరణ ప్రక్రియ ప్రజల గౌరవం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించారు. దాదాపు 1.5 కోట్ల మంది కన్నడిగులు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, తన ఓటు కూడా తొలగించారని చెప్పారు. అక్రమంగా ఓటర్ల జాబితాలో చేరిన పేర్లను తొలగించడంపై తనకు అభ్యంతరం లేదని, అయితే చట్టబద్ధంగా ఓటు హక్కు కలిగి, ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి పేర్లను ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు.
నటుడు కిశోర్ కూడా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఉద్దేశంతో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ ర్యాలీలో కర్ణాటక జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు నూర్ శ్రీధర్, దళిత ఉద్యమ నాయకులు ఎన్ వెంకటేశ్, రైతు, మహిళా, దళిత, భాషా ఉద్యమాలకు చెందిన పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా ర్యాలీ సందర్భంగా బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నటులు ప్రకాష్ రాజ్, కిశోర్ సహా ర్యాలీలో పాల్గొన్న కీలక నేతలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. సామాజిక మాధ్యమాల్లోనూ ఎస్‌ఐఆర్ అంశంపై దుమారం చెలరేగింది.







కామెంట్‌లు (0)