ప్రజాశక్తి - టంగుటూరు (ప్రకాశం జిల్లా):ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్త్ రాజుపాలెం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా, విజయవాడకు చెందిన వెంపాటి రాధాకుమారి, భర్త వెంకటకృష్ణ బెంగళూరులో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. విజయవాడలో బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు బెంగళూరులోని ఐటిఐ గేటు వద్ద బుధవారం రాత్రి పదిన్నర గంటలకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును ఇద్దరు పిల్లలతో కలిసి ఎక్కారు. అనంతరం నిద్రపోగా నార్త్ రాజుపాలెం కామాక్షి హోటల్ వద్ద తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు కాలకృత్యాలు కోసం బస్సును నిలిపారు. ఈ క్రమంలో వారి వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్ కనిపించలేదు. బ్యాగు వెతకగా వెనుక సీటు కింద బ్యాగ్ పడేసి ఉండటాన్ని ఓ వ్యక్తి గుర్తించాడు. ఆ బ్యాగులో చూడగా దానిలో ఉంచిన పొడవు హారం, నెక్లెస్, చేతి కడియం, ప్లేయిన్ చైన్, నల్లపూసలు, డైమండ్ లాకెట్, చెవి కమ్మలు కలిపి 400 గ్రాముల బంగారం కనిపించలేదు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బస్సు డ్రైవర్‌కు విషయాన్ని తెలిపారు. బస్సును టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు బస్సును, ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకున్నారు. ఆభరణాలు విలువ రూ.22 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఫణిభూషణ్ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును కొడవలూరి పోలీస్ స్టేషన్‌కు పంపనున్నట్లు తెలిపారు.
Print Editionబస్సులో బంగారు ఆభరణాల చోరీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)