గ్రానైట్ వ్యర్థాలను తొలగించాలి.. అర్ధనగ్నంగా రైతుల నిరసన
క్వారీ ప్రభావిత ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి
ఆదివాసీ, రైతు సంఘాల నాయకుల ఆందోళన
అమర్ గ్రానైట్ పర్యావరణ అనుమతుల సభ రద్దు చేయాలి
ప్రజాశక్తి-రావికమతం : గ్రానైట్ క్వారీల కార్యకలాపాల వల్ల గిరిజన రైతుల సాగుభూములు, జీడిమామిడి తోటలు ధ్వంసమవుతున్నాయని, క్వారీ వ్యర్థాలు తమ భూముల్లో పేరుకుపోతున్నాయని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ, రైతు సంఘాల ఆద్వర్యంలో ఊటగడ్డ వద్ద గిరిజన రైతులు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రావికమతం మండలం కోమిరి రెవెన్యూ పరిధిలోని పలు సర్వే నంబర్లలో పది మంది గిరిజన రైతులు సుమారు 8 ఎకరాల్లో జీడిమామిడి తోటలు, ఇతర పంటలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిపారు. ఉర్లోవ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1లో నిర్వహిస్తున్న పలు గ్రానైట్ క్వారీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కొండ దిగువన ఉన్న ఏనుగుల గడ్డ, దూదేకుల గడ్డ, సింగారపు గడ్డ తదితర ప్రాంతాల్లో పేరుకుపోయి తమ భూములను కప్పివేశాయని ఆరోపించారు.
ఈ సమస్యపై 2017లో ‘డయల్ యువర్ కలెక్టర్’లో ఫిర్యాదు చేయడంతో అప్పటి మైన్స్ అధికారులు క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారని, అనంతరం తహసీల్దార్, పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. అధికారులు గిరిజన భూములను స్వయంగా పరిశీలించినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గ్రానైట్ క్వారీలకు గతంలో నిర్వహించిన పర్యావరణ అనుమతుల సభల్లో మొక్కలు నాటడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, సీఎస్‌ఆర్, జిల్లా ఖనిజ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని హామీలు ఇచ్చినా, అవి అమలు కాలేదని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉర్లోవ కొండపై సర్వే నంబర్ 1లో సుమారు 25 ఎకరాల్లో అమర్ గ్రానైట్ క్వారీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించనున్న నేపథ్యంలో తమ పంట పొలాలు, తోటలకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ తక్షణమే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతుల హామీల అమలుపై విచారణ జరపాలని రైతులు కోరారు. అలాగే అమర్ గ్రానైట్ క్వారీ పర్యావరణ అనుమతుల ప్రజాభిప్రాయ సేకరణ సభను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.







కామెంట్‌లు (0)