శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రకాశంలో లాకప్ డెత్!

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 01:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

-ఎస్‌టి యువకుడిని పోలీసులే కొట్టి చంపారన్న
కుటుంబ సభ్యులు

ప్రజాశక్తి- ఒంగోలు సిటీ : విజయవాడలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్‌ కేసు మరవకముందే ‌దాదాపు అటువంటి ఘటనే ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణంగివరం పోలీసు స్టేషన్లో చోటు చేసుకుంది. విచారణ పేరుతో పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లిన వ్యక్తి శవమై తేలారు. మృతదేహం పొలాల్లో పడి ఉండడం తీవ్ర కలకలం రేపింది. తన కుమారుడు మల్లి దివ్యతేజ (34)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొట్టి చంపారని, అనంతరం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పొలాల్లో పడేశారని మృతుని తల్లి సలోమి ఆరోపిస్తున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా బి.బిట్రగుంట మండలం కప్పరాలతిప్ప సమీపంలోని అల్లిమడుగు సంగం గ్రామానికి చెందిన సలోమి కుమారుడు దివ్యతేజ గత నెల 29వ తేదీ రాత్రి తన స్నేహితుడు పాతపాటి శశికాంత్‌తో కలిసి బయటకు వెళ్లారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్నారంటూ వారిద్దరినీ గత నెల 30వ తేదీ వేకువజామున రేణంగివరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శశికాంత్‌ను విడిచిపెట్టారు. దివ్యతేజ ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో, మిస్సింగ్‌ కేసు పెట్టడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కొండమూరు సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందంటూ, వచ్చి చూడాలంటూ పోలీసుల నుంచి ఈ నెల 3న సమాచారం రావడంతో దివ్యతేజ కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించారు. అది తన కుమారుడి మృతదేహమేనని సలోమి గుర్తించారు.

లాకప్‌లోనే చంపేశారు... అందుకే ఎస్ఐ కంగారు పడ్డారు : మృతుని సోదరి

తన అన్నను పోలీసులు లాకప్‌లోనే కొట్టి చంపారని దివ్యతేజ సోదరి శ్రీనిధి ఆరోపించారు. తన అన్న ఆచూకీ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పుడు ఎస్ఐ కంగారుగా వ్యవహరించడంతో అప్పుడే అనుమానం వచ్చిందన్నారు. తన అన్న భార్య మృతి చెందడంతో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని తెలిపారు. తాము ఎస్టి సామాజిక తరగతికి చెందిన వారం కారణంతో పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని ఆరోపించారు. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం కొండమూరు పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభించినట్లు పోలీసులు తమ న్యాయవాదికి సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

మృతుని కుటుంబసభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదు : డిఎస్‌పి

దివ్యతేజ మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని దర్శి డిఎస్‌పి బాలమురళీకృష్ణ తెలిపారు. మృతుని కుటుంబసభ్యుల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ కొనసాగుతోందని తెలిపారు. గత నెల 29వ తేదీ రాత్రి రేణంగివరం పరిధిలో నైట్‌బీట్‌లో ఉన్న పోలీసులు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గుర్తించారని చెప్పారు. పోలీసులను చూసి వారు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వెంబడించారని తెలిపారు. మరుసటి రోజు సెల్‌ఫోన్‌ చోరీ కేసులో శశికాంత్‌ను పోలీసులు పట్టుకున్నార ని, మరో వ్యక్తి తప్పించుకున్నా డని వివరించారు. 3వ తేదీన కొండమూరు పొలాల్లో గుర్తుతెలియని మృతదేహం లభించగా, విచారణలో అది దివ్యతేజ దని తేలిందని తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్