26 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
ప్రజాశక్తి - కుక్కునూరు రూరల్ : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మంగళవారం భద్రాచలంలో 28 అడుగులు ఉన్న గోదావరి వరద బుధవారం నాటికి 34.9 అడుగులకు చేరుకుని క్రమంగా పెరుగుతోంది. వేలేరుపాడు నుంచి కోయిదా వెళ్లే మార్గంలో వాళ్లపల్లి వద్ద ఉన్న ఎద్దు వాగు కాజ్‌వే నీట మునగడంతో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు దాటడానికి మోటార్ బోటును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కుక్కునూరు మండలంలోని గుండేటి వాగు కాజ్‌వే పైకి వరద నీరు చేరడంతో 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. గోదావరి ఉప నదులు ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, సీలేరు జలాలతో గోదావరి నీటిమట్టం బుధవారం నాటికి అనూహ్యంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరిలో 5,72,087 క్యూసెక్కుల జలాలు ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులోకి అదనంగా వస్తున్న 5,68,658 క్యూసెక్కుల వరద జలాలను ప్రాజెక్టు స్పిల్ వే నుండి విడుదల చేసినట్లు డిఇఇ వెంకటేశ్వరరావు తెలిపారు.






కామెంట్‌లు (0)