- పొంగిన డ్రెయినేజీలు, రోడ్లు జలమయం
- ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- గన్నవరం దిగాల్సిన విమానం రాజమండ్రిలో ల్యాండింగ్
ప్రజాశక్తి - యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయ్యమయ్యాయి. పలు పల్లపు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వంతెన కొట్టుకు పోవడంతో ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపో యాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, సముద్రం తీవ్ర అలజడిగా ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరంలో దిగాల్సిన విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు.అల్లూరి జిల్లాలో ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, జికె.వీధి మండలంలో భారీ వర్షం కురవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బత్తునూరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. చిన్న గంగవరం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ ఉన్న వంతెన 2024 సెప్టెంబరు 9న వరదలకు కొట్టుకుపోయింది. అప్పటి నుంచి వంతెన నిర్మించాలని ప్రభుత్వానికి ప్రజలు విన్న వించుకున్నా స్పందించలేదు. దీంతో వారే తలో చెయ్యి వేసి తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. అది ఈ వర్షాలకు కొట్టుకుపోయింది. మరోవైపు జిల్లాలోని జలాపాతాలన్నీ హోరు శబ్దం చేస్తూ ప్రవహిస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు పట్టి చల్లని గాలులు వీచాయి. భీమిలి మండలం ఎగువపేట నుంచి విశాఖలోని నోవాటెల్ హోటల్ వరకూ సముద్ర తీరం అక్కడక్కడా కోతకు గురైంది. ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల్లో కురిసిన వర్షంతో రహదారులపై మోకాలి లోతులో నీరు ప్రవహించింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో కొన్ని విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. పాతబస్తీలోని పలు లోతట్టు ప్రాంతాలు, మహంతిపురం, ఇస్లాంపేట, నైజాంగేట్, కెఎల్‌రావు నగర్, భవానీపురం, హెచ్‌బి కాలనీ, కబేళా, రోటరీనగర్, విద్యాధరాపురం ప్రాంతాల్లో వర్షపు నీరు నివాస ప్రాంతాల్లోకి చేరింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరంలో దిగాల్సిన ఇండిగో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరామపురంలో అత్యధికంగా 25.5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎల్ఎన్ పేట మండలంలో 20 మిల్లీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 16.5 మిల్లీమీటర్లు, ఆమదాలవలస మండలంలో 9.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇచ్ఛాపురం మండలంలో అత్యల్పంగా 0.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కడియం, చాగల్లు, ఉండ్రాజవరం, దేవరపల్లి మండలాల్లో, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని మండలాల్లో జల్లులు పడ్డాయి. ఉప్పాడ, అల్లవరం, యానాం సముద్రతీర ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం, అంబాజీపేట, పి.గన్నవరం, ఆలమూరు, రామచంద్రపురం మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకు పలు గ్రామాల్లో అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉదయం ఏడు గంటల నుంచి గంటపాటు భారీ వర్షం కురిసింది.








కామెంట్‌లు (0)