ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెరిగి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో 12వ పిఆర్ సి కమిషన్ ఏర్పాటు చేసేలోపు మధ్యంతర భృతి చెల్లించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ సంఘ నాయకులు గురువారం సచివాలయంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గత రెండేళ్లుగా మున్సిపల్ కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించిన జిఒ జారీ విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని యూనియన్ నాయకులు మంత్రిని కోరారు. 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లలో వందలాది మంది కార్మికులు పదవీ విరమణ చేసినప్పటికీ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కుటుంబ పోషణకు ఆధారమైన ఉద్యోగం కోల్పోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని వివరించారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల కుటుంబాలకు ‘తల్లికి వందనం’ పథకం అమలు కాకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొందని నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.సమస్యలపై మంత్రి పి.నారాయణ స్పందిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సి అండ్ డిఎంఎ, ఆర్థిక శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మంత్రిని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు పి లక్ష్మణరావు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు జె విజయలక్ష్మి, టి తిరుపతమ్మ, టి చిన్న తదితరులు ఉన్నారు.
Print Editionమున్సిపల్ కార్మికులకు మధ్యంతర భృతి చెల్లించాలి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)