ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్
జూలై 30న 'చలో కలెక్టరేట్'ను విజయవంతం చేయండి సీఐటీయూ పిలుపు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల ప్రకారం 'సమాన పనికి సమాన వేతనం' చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. శాశ్వత స్వభావం గల విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ జూలై 30వ తేదీన తలపెట్టిన 'చలో కలెక్టరేట్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహనరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి. రమణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎన్‌పీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే ఈ 'చలో కలెక్టరేట్' ధర్నాలో మున్సిపల్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు ప్రతి ఐదేళ్లకొకసారి జీతాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైసిపి పాలనలో 2019లో (అది కూడా రెండేళ్లు ఆలస్యంగా) మున్సిపల్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు జీతాలు పెరిగాయని గుర్తుచేశారు. తిరిగి మళ్లీ 2023 జూలై నుంచే జీతాలు పెరగాల్సి ఉన్నప్పటికీ... గత వైసిపి ప్రభుత్వం కానీ, నేటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ కార్మికుల వేతనాల పెంపు గురించి పల్లెత్తు మాట మాట్లాడడం లేదని మండిపడ్డారు. ఇప్పటివరకు 12వ పీఆర్సీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలను సంతలో సరుకుల్లా బేరానికి పెట్టాయని నేతలు విమర్శించారు. మున్సిపల్ పౌర సేవలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టి, ప్రజలపై యూజర్ చార్జీల భారం మోపడానికి సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. సమాజంలో ఇతరులు ఎవరూ చేయలేని క్లిష్టమైన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలకే ఇవి ఎసరు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఏ పేరుతో పనిచేస్తున్నప్పటికీ, ఒకే విధమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు 'సమాన పనికి సమాన వేతనం' చెల్లించాలని 2016 అక్టోబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని వారు గుర్తుచేశారు. అలాగే, శాశ్వత స్వభావం గల విధుల్లో ఉన్న కార్మికులను పర్మినెంట్ చేయాలని 2026 ఏప్రిల్‌లో రాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిందన్నారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని కోరుతూ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లిన నంద్యాల మున్సిపల్ కార్మికులకు మినిమం టైమ్‌స్కేల్ జీతాలు చెల్లించాలని కోర్టులు సూచించాయని తెలిపారు. ఈ కోర్టు తీర్పులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 30న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు బి. భాస్కరరావు, జి. కుమారి, జి. రమ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)