- సామాజిక శంఖారావంలో నేతలు
ప్రజాశక్తి - భీమవరం, గుంటూరు : దళితుల సమస్యలు, అసమానతలపై సామాజిక శంఖారావం పూరించినట్లు కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు బి.బలరాం తెలిపారు. కెవిపిఎస్, ఎపి వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం వర్స్‌షాపును భీమవరం, గుంటూరులో శుక్రవారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన వర్క్‌షాపులో బలరాం మాట్లాడుతూ...స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు పూర్తవుతున్నా నేటికీ దళితులు అభివృద్ధికి దూరంగా ఉన్నారని, కులవివక్ష, అంటరానితనాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులపై అనేక విధాలుగా దాడులు చేస్తున్నా అధికార, ప్రధాన ప్రతిపక్ష నేతలు ఖండించకపోవడం సిగ్గుచేటన్నారు. కుల, మత, ప్రాంత ఘర్షణలకు తావిచ్చేలా మాట్లాడిన రఘురామ కృష్ణంరాజును మాత్రం ఖండించని ప్రభుత్వం యూట్యూబ్ ప్రశ్న రావణ్ పై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఉండి మండలం పాందువ్వ గ్రామంలో దళిత యువకుడు వీధి నవీన్ కుమార్ ను వేధించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన ఆకివీడు సిఐపై నేటికీ చర్యలు లేవన్నారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులపై పెత్తందారులు, భూస్వాములు, ఆధిపత్య కుల దురహంకారులు చేస్తున్న అరాచకాలను, ఆధిపత్యాన్ని బద్దలు కొట్టేలా సామాజిక శంఖారావం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రపంచంలో లేని కులం భారతదేశంలో మాత్రమే ఉందని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కెవిపిఎస్ చేసిన పోరాటాల్లో జస్టిస్ పున్నయ్య కమిషన్ ను ఏర్పాటు చేయించి విజయం సాధించామని, అదే తొలి రాష్ట్ర ఎస్‌సి కమిషన్ అయ్యిందని గుర్తించారు. దళితులపై చూపే కులవివక్ష, అంటరానితనం రూపాలను బట్టబయలు చేసి ప్రభుత్వం దృష్టికి సామాజిక శంఖారావంలో తీసుకెళ్లేలా కృషి చేస్తామన్నారు. గుంటూరు బ్రాడీపేటలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట కోశాధికారి కె. ఆంజనేయులు మాట్లాడుతూ... నేటి ఆధునిక యుగంలోనూ గ్రామాలు, పట్టణాల్లో వివిధ రూపాల్లో కుల వివక్షత కొనసాగుతోందని, కులాంతర వివాహాల సంఖ్య పెరిగినప్పటికీ, అలాంటి వారిపై దాడులు, హత్యలు కూడా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. రాష్ట్రంలో ఏటా రెండు వేలకుపైగా ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదవుతున్నాయని, అభివృద్ధి విషయంలోనూ దళితుల పట్ల వివక్షత కొనసాగుతోందని వివరించారు. నీరు, రోడ్లు, విద్య, వైద్యం తదితర సౌకర్యాల కల్పనలోనూ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల విలీనంలో ఎస్‌సి కాలనీల్లోని పాఠశాలలను రద్దు చేయడం ద్వారా దళితులకు విద్యను దూరం చేయటంతోపాటు, పోలింగ్ బూత్‌లను కూడా ఎస్‌సి కాలనీల్లో ఉండకుండా చేయటమే పాలక వర్గాల లక్ష్యంగా మారిందని విమర్శించారు.







కామెంట్‌లు (0)