లీకేజీల నివారణకు నందన్ నీలేకని సూచన
కృత్రిమ మేథస్సును వాడతాం అంటూ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : దేశ పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతకు ముప్పుగా మారిన ప్రశ్నా పత్రాల లీకేజీలను నివారించడానికి ఇన్ఫోసిప్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని ఒక సూచన చేశారు. బృహత్తరమైన రీతిలో ప్రశ్నా పత్రాల బ్యాంక్‌ను రూపొందించాలని, చిట్ట చివరి నిముషంలో మాత్రమే తుది ప్రశ్నా పత్రాన్ని రూపొందించాలని సూచించారు. పరీక్ష జరిగే రోజే ప్రశ్నా పత్రాన్ని రూపొందించేందుకు కృత్రిమ మేథస్సును కూడా ఉపయోగించుకోవచ్చని అన్నారు. ఇవి పని చేయాలంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్‌లో పరీక్షలు నిర్వహించాల్సి వుంటుందన్నారు. సాంప్రదాయసిద్ధమైన పెన్ను, పేపర్ పద్ధతిని వదిలిపెట్టాలన్నారు. జులైలో కేంద్ర ప్రభుత్వం పరీక్షల సంస్కరణలపై ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌కు నీలేకని చైర్మన్‌గా వున్నారు. టాస్క్ ఫోర్స్ గుర్తించిన పరీక్షా వ్యవస్థలోని బలహీనతలు, భద్రతాపరమైన లోపాల గురించి మంగళవారం ఇక్కడ జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరం సమావేశాల్లో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘ఈ కమిటీ ఏర్పడడానికి దారి తీసిన ప్రధాన సమస్య ప్రశ్నా పత్రాల లీకేజీలు. ప్రశ్నా పత్రంగా పిలుస్తున్న దాని అవసరం మనకు ఎందుకు వుంది? అది అమ్ముడవడానికి ఆర్థికపరమైన రాయితీ కల్పిస్తుంది కనుక. దీన్ని పరిష్కరించడానికి పరిశీలిస్తున్న మార్గాల్లో ఒకటి, బృహత్తరమైన ప్రశ్నల బ్యాంక్‌ను రూపొందించడం. చివరి నిముషంలో ఆ రోజుకు అవసరమైన ప్రశ్నా పత్రాన్ని సిద్ధం చేయడం.’’ అని నీలేకని చెప్పారు. ఆ రోజునే సిద్ధం చేయాలంటే కృత్రిమ మేథను ఉపయోగిస్తారా అని ప్రశ్నించగా, కచ్చితంగా అని నీలేకని సమాధానమిచ్చారు. ‘‘వ్యవస్థాగతంగా దీన్ని పరిశీలించినట్లైతే, ఎందుకు ఇది జరుగుతోంది అంటూమూల కారణాన్ని పరిశీలించాలి, అవి పరిష్కారమయ్యే అంశాలైతే అందుకు సాంకేతికతను ఉపయోగించాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ టాస్క్ ఫోర్స్ ఇప్పటివరకు 18 సార్లు సమావేశమైంది. 40 సంప్రదింపుల సమావేశాలు జరిపింది. విద్యార్ధులు, తల్లిదండ్రులు, డాక్టర్ల సమాఖ్యలతో సహా పలువురు నుండి 50 వేలకు పైగా సూచనలు అందుకుంది. అలాగే నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డు వంటి పరీక్షలు నిర్వహించే సంస్థల నుండి కూడా సూచనలు తీసుకుంది.





కామెంట్‌లు (0)