మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనిరసన స్థలంగా జంతర్ మంతర్‌ కొనసాగాలి

1 గంట క్రితం

cpm flag image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 01:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రభుత్వ చర్యను ఖండించిన సిపిఎం

​​న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు నిర్దేశిత నిరసన స్థలం హోదాను రద్దు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. కేంద్ర హోంశాఖ ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో.. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధమైన, నిరంకుశ చర్య అని పేర్కొంది. అసమ్మతిని సహించలేని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికీ, శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధ హక్కు పట్ల దానికి ఉన్న తిరస్కార భావానికీ ఇది నిదర్శనమని విమర్శించింది.

జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి నిరాకరించడాన్ని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఒక అలవాటుగా మార్చుకున్నారని పేర్కొంది. గతంలో పోలీసులు ఏకపక్ష ఆంక్షల ద్వారా అమలు చేసిన దాన్ని ఇప్పుడు ఈ నిర్ణయంతో అధికారికం చేశారని పోలిట్‌‌బ్యూరో తెలిపింది. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని అణచివేసేందుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నమని పేర్కొంది.

ప్రత్యామ్నాయ వేదికలుగా ప్రతిపాదించిన రాంలీలా మైదానం, బురారీ గ్రౌండ్, సిబిడి గ్రౌండ్‌లు జంతర్ మంతర్‌కు ఏమాత్రం సాటిరావని పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. ప్రజా నిరసనలను రాజకీయ అధికార కేంద్రాలకు దూరంగా నెట్టివేయడమే దీని లక్ష్యమని పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు జంతర్ మంతర్‌ను ముఖ్య వేదికగా నిలిపిన పలువురి దృష్టిని ఆకర్షించడం, అందరికీ అందుబాటు, సామీప్యం వంటివి ఈ వేదికల వల్ల దక్కవని తెలిపింది. ప్రజల అసమ్మతిని కనిపించకుండా, రాజకీయంగా ప్రభావ రహితంగా మార్చే ప్రయత్నమే ఇదని విమర్శించింది. జంతర్ మంతర్ ప్రజల నిరసన స్థలంగా కొనసాగుతుందని, దీన్ని ఆపే అన్ని ప్రయత్నాలనూ ప్రతిఘటిస్తామని సిపిఎం ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్