జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
న్యూఢిల్లీ బ్యూరో: ఢిల్లీలో నిరసన వేదికల జాబితా నుండి జంతర్ మంతర్ ను కేంద్ర ప్రభుత్వం తొలగించి 24 గంటలు గడవక ముందే పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన అడ్డంకులను అధిగమించి కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) అక్కడకు చేరుకుంది. జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేసింది. మంగళవారం తెల్లవారుజామున అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ సంఘటనతో ఉలికిపడిన పోలీసులు లోపలికి ప్రవేశించిన వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు. జంతర్‌మంతర్‌కు పక్కనే ఉన్న జనతాదళ్ (యునైటెడ్) కార్యాలయం నుండి గేట్లు దూకి సిజెపి నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండేతో పాటు మరికొందరు జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించారు. ఆ వెంటనే జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒకరి తరువాత ఒకరిగా దాదాపు పది మంది జంతర్‌మంతర్‌లోకి దూకడంతో అప్పటికే అక్కడ విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది కొంత కలవరానికి గురైంది. ఆ వెంటనే తేరుకుని వారిని అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనను అంతా సిజెపి వీడియో తీసి సోషల్ మీడియా ఖాతాలో అప్‌లోడ్ చేసింది. జంతర్ మంతర్‌లోకి ప్రవేశించడాన్ని సిజెపి నేతలు తమ విజయంగా అభివర్ణించారు. తాము నిరసన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని, పోలీసులు నిర్బంధించారని సిజెపి నేత సౌరవ్ దాస్ అన్నారు. యువత తమ హక్కుల కోసం ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ నిరసనల వేదికగా కొనసాగాలని మరో నాయకుడు అశుతోష్ రంకా వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సోమవారం నాడే సిజెపి ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. అనంతరం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్ లో లిఖితపూర్యకంగా అనుమతి కోరింది. తేదీని పోలీసులే నిర్ణయించి చెప్పాలని కూడా అభ్యర్ధించింది. 24 గంటల్లో నిర్ణయం తెలపకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించింది. తమ దరఖాస్తు అందిన గంట తర్వాత పోలీసులు అనుమతి నిరాకరించారని సిజెపి తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి సిజెపి నాయకులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తదితరులపై ఎప్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా జంతర్‌మంతర్‌లోకి అక్రమంగా ప్రవేశించారంటూ సిజెపి నేతలపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. శాంతి భద్రతలను కాపాడతామంటూ ఇచ్చిన బాండ్‌ను కూడా ఉల్లంఘించి, ఉద్రిక్తతలకు కారణమయ్యారని కూడా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. జంతర్‌మంతర్‌లోకి ప్రవేశించిన 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు, వారిని జాఫర్‌పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు.
నియంతృత్వ ధోరణి : అభిజిత్ దీప్కే
సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈ నిర్బంధాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఖండించారు. నిరసన వేదికను అధికారికంగా తొలగించవచ్చేమో కానీ, ప్రజల నిరసన స్ఫూర్తిని అడ్డుకోలేరని పేర్కొన్నారు. జంతర్ మంతర్ కేవలం ఒక ప్రాంతం కాదని, ప్రజల నిరసన హక్కుకు ప్రతీక అని అన్నారు. దేశంలో నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఆయన పేర్కొన్నారు.మ పార్టీ న్యాయవాది రత్నా సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినప్పుడు లోపలికి అనుమతించలేదన్నారు. సిజెపికి చెందిన ఇతర నేతలనూ అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరించారని తెలిపారు.
20 వరకు సాయుధ బలగాలు
కేంద్ర సాయుధ పోలీసు బలగాల మొహరింపును ఈ నెల 20వ తేది వరకు పొడిగించాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖను కోరారు. ఈ మేరకు లేఖ రాసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు అందించిన సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న 273 కంపెనీల మోహరింపు గడువు ముగియడంతో ఈ మేరకు లేఖ రాశారు.
రాంలీలాకు రోజుకు రూ.1.21 లక్షలు
నిరసనలు తెలపడానికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రతిపాదించిన రామ్‌లీలా మైదాన్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది. దీనికి రోజుకు రూ.1.21 లక్షలను ఆ సంస్థ వసూలు చేస్తోంది. ఈ ఏదాదంతా ఈ మైదానాన్ని ఇప్పటికే వివిధ కార్యక్రమాల కోసం బుక్ చేసుకున్నారు. కమిషనర్ ప్రతిపాదించిన బురారీ గ్రౌండ్, తూర్పు ఢిల్లీలోని సిబిడి గ్రౌండ్‌లు ఢిల్లీకి సుమారుగా 20 నుండి 30 కి.మీ దూరంలో ఉన్నాయి.






కామెంట్‌లు (0)