మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్ టిసి పరిరక్షణకు సంఘీభావం కోరిన జెఎసి

08 ఆగస్టు, 2026

rtc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 08:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్ టిసి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, ప్రజా రవాణా సంస్థ పరిరక్షణ, ఆర్ టిసి ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు భవిష్యత్‌లో చేపట్టనున్న ఉద్యమాలకు విస్తృత మద్దతు కూడగట్టే దిశగా ఎపిపిటిడి (ఆర్ టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి కార్యాచరణకు దిగింది. ఇందులో భాగంగా శనివారం విజయవాడలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకటసుబ్బయ్య, జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎపి హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌ రవిలను ఆర్ టిసి జెఎసి ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించి మద్దతు కోరారు. ఆర్ టిసిలో ఆపరేటర్ల ద్వారా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి క్రమంగా సంస్ధను ప్రయివేటీకరణ వైపు నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జెఎసి నాయకులు ఆరోపించారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు, పిఎఫ్ సమస్యలు, హయ్యర్ పెన్షన్, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్ టిసిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ప్రయివేటీకరణకు బదులు సంస్థకు అవసరమైన సిబ్బందిని, కొత్త బస్సులను సమకూర్చి ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని కోరారు.జెఎసి చేపట్టిన మూడో దశ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9, 10 తేదీల్లో మిగిలిన అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులను కలిసి మద్దతు కోరనున్నట్లు తెలిపారు. ఆర్ టిసి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని జెఎసి ప్రతినిధులు ప్రకటించారు. ఈకార్యక్రమంలో ఆర్ టిసి జెఎసి కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, కో-కన్వీనర్లు సిహెచ్‌ సుందరయ్య, పివి రమణారెడ్డి, జివి నరసయ్య, ఎస్ వి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్