ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

15న 'జనగలం సామూహిక రాయబారం'.. జయప్రదం చేయండి: సీపీఎం

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మంగళగిరిలో జీప్ జాతా ప్రచారం ప్రారంభం

  • ఇళ్ల స్థలాలు, పట్టాల సాధనకై మంత్రి నారా లోకేష్ వద్దకు పాదయాత్ర

ప్రజాశక్తి-మంగళగిరి : నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల సాధన కోసం ఈ నెల 15వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'మంగళగిరి జనగలం సామూహిక రాయబారం' పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు జె.వి. రాఘవులు పిలుపునిచ్చారు. ఆదివారం మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఈ కార్యక్రమ ప్రచార జీప్ జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు మంగళగిరి నియోజకవర్గంలో వివిధ రకాల భూముల్లో ఇళ్లు వేసుకుని నివసిస్తున్న వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని రాఘవులు గుర్తుచేశారు. అలాగే నియోజకవర్గంలోని 20 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారన్నారు. ఈ హామీలను నెరవేర్చాలని కోరుతూ ఇప్పటికే సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇవ్వడం, నిరాహార దీక్షలు చేయడం, కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులకు దరఖాస్తులు అందజేయడం జరిగిందని తెలిపారు.

ఎన్నికల ముందు నారా లోకేష్ సీతానగరం వద్ద ఇళ్ల స్థలాల కోసం శిలాఫలకం కూడా వేశారని, అయితే ఇప్పటివరకు ఆ వాగ్దానాన్ని అమలు చేయకపోవడంతోనే ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఉండవల్లి సెంటర్ నుండి 'జనగలం సామూహిక రాయబారం' పాదయాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్రలో నియోజకవర్గ ప్రజలు, నిరుపేదలు వందలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంగళగిరి ప్రాంతంలోని సర్వే నెంబర్ 7లో ఉన్న భూమిని, రత్నాల చెరువులో ల్యాండ్ బ్యాంక్ కింద ఉన్న 50 ఎకరాల భూమిని పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాలాజీ మాట్లాడుతూ.. మంగళగిరి పట్టణంలో స్థలాభావం వల్ల ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు కలిసి జీవనం సాగిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో వేలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేయడం సరికాదని విమర్శించారు. రద్దు చేసిన వారందరికీ స్థానికంగానే ప్రత్యామ్నాయ ఇళ్ల స్థలాలు చూపి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, పట్టణ కమిటీ సభ్యులు ఎం. చలపతిరావు, మంగళగిరి ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె. బుజ్జిబాబు, ఎ. రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పలు సెంటర్లలో జీప్ జాతా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్