ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Argentina ఫుట్‌బాల్ లెజెండ్ ఆంటోనియో రాటిన్ కన్నుమూత

2 గంటల క్రితం

Argentine football legend Antonio Rattin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 11:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అర్జెంటీనా ఫుట్‌బాల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతితో ఫుట్‌బాల్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. రాటిన్ మరణం పట్ల అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) అధ్యక్షుడు క్లాడియో టాపియా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయనను అర్జెంటీనా ఫుట్‌బాల్‌కు తిరుగులేని ఐకాన్‌గా కొనియాడారు. ఫుట్‌బాల్ ఆటలో విప్లవాత్మక మార్పుగా మారిన 'ఎల్లో, రెడ్ కార్డుల' వ్యవస్థ రావడానికి కారణమైన చారిత్రక ఘట్టంలో రాటిన్ కీలక పాత్ర పోషించారు.

ఆట గమనాన్ని మార్చిన 'చారిత్రక నిరసన'

1966లో ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ క్వార్టర్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో అర్జెంటీనా తలపడింది. ఆ మ్యాచ్‌లో జర్మనీకి చెందిన రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్.. అర్జెంటీనా కెప్టెన్‌గా ఉన్న రాటిన్‌ను మైదానం వీడాల్సిందిగా ఆదేశించారు. అయితే, అప్పట్లో ఆటగాళ్లను హెచ్చరించడానికి ఎల్లో, రెడ్ కార్డుల విధానం లేదు. రెఫరీ నిర్ణయం అన్యాయమని భావించిన రాటిన్, భాష అర్థం కాకపోవడంతో అనువాదకుడు కావాలని డిమాండ్ చేస్తూ మైదానంలోనే భీష్మించుకు కూర్చున్నారు.

అంతటితో ఆగకుండా, బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని ఆయన నిరసన తెలపడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ వివాదం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయడంతో, రెఫరీల నిర్ణయాలను ఆటగాళ్లకు స్పష్టంగా తెలియజేసేందుకు వీలుగా ఫిఫా (FIFA) 1970 ప్రపంచకప్ నుంచి అధికారికంగా ఎల్లో, రెడ్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఒకే క్లబ్‌కు జీవితాంతం సేవలు

రాటిన్ తన సుదీర్ఘ క్లబ్ కెరీర్ మొత్తాన్ని (1956-1970) ప్రఖ్యాత 'బోకా జూనియర్స్' క్లబ్‌కే అంకితం చేశారు. ఆ క్లబ్ తరఫున రికార్డు స్థాయిలో 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దేశం తరఫున 1962, 1966 ప్రపంచకప్‌లలో ప్రాతినిధ్యం వహించిన రాటిన్.. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా, రాజకీయ నాయకుడిగానూ రాణించారు. మైదానంలో అంకితభావానికి, దేశం పట్ల గర్వానికి నిదర్శనంగా నిలిచిన రాటిన్ పేరు ఫుట్‌బాల్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్