జమ్మికుంట (తెలంగాణ) : ఊర్లో వరుస మరణాలు సంభవిస్తుండటంతో ... గ్రామాన్నే ఖాళీ చేసి ఊరి బయట వంటలు చేసుకొని జీవనాన్ని గడుపుతున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో గురువారం జరిగింది. జమ్మికుంట పట్టణంలోని 13, 14 వ వార్డు ఆబాది జమ్మికుంట గ్రామంలో ఊరికి కీడు సోకిందనే నమ్మకంతో గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా "గ్రామం ఖాళీ" చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ... విలాసాగర్‌లో కొన్ని నెలలుగా ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతున్నారు. ఇలా గ్రామంలో వరుసగా 11 మంది మృతి చెందడంతో ఆయా కులాల పెద్దలందరూ వేదపండితులను ఆశ్రయించారు. గ్రామానికి కీడు సోకిందని వేదపండితులు చెప్పడంతో ... వారి సలహా మేరకు ఊర్లో జనమంతా గురువారం వేకువజామున 5 గంటలకు ముందే ఇళ్లకు తాళాలు వేసి సమీపంలోని మానేరు పరీవాహక ప్రాంతం బ్రిడ్జి వద్దకు తరలివెళ్లారు. అక్కడే వంటలు చేసుకొని సాయంత్రం వరకు గడిపి చీకటిపడ్డాక ఇంటిబాట పట్టారు. దీంతో గ్రామంలో నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఊరికి అపశకునం, కీడు సోకిందని భావించినప్పుడు ఇలా ఊరు బయట వంటలు చేసుకుని, ప్రత్యేక పూజలు చేయడం పాతకాలపు ఆచారం అని గ్రామస్తులు చెబుతున్నారు. "ఊరు శుద్ధి" కోసం ఇలా చేయడం వల్ల కీడు తొలగిపోతుందని స్థానికుల నమ్మకం. గతంలో కూడా బయటికి ఇలాగే వంటలకు వెళ్ళామని గ్రామస్తులు తెలిపారు.
ఊరికి కీడు సోకిందని.. పగలంతా ఊరిబయట.. రాత్రికి ఇంటిబాట ..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 12:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)