- మంత్రులు లోకేష్, పార్థసారధి, కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ
ప్రజాశక్తి - ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్), ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా, రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో, కొన్ని చోట్ల మండల కేంద్రాల్లో జర్నలిస్టులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎపిడబ్ల్యజెఎఫ్, ఎపి బిజెపి ప్రతినిధులు విశాఖపట్నంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధికి, కర్నూలు జిల్లాలో ఫెడరేషన్ ప్రతినిధి వర్గం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రాలను అందజేశారు. విజయవాడలో రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ బాషాకు, ఎన్‌టిఆర్ జిల్లా ప్రతినిధి వర్గం జిల్లా డిఆర్ఒకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లకు, ఆర్‌డిఒలు, తహశీల్దార్లకు వినతిపత్రాలను సమర్పించి... జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిం చాలని కోరారు. ఈ ఏడాది మార్చి నాలుగున విజయవాడలో జరిగిన జర్నలిస్టు ర్యాలీనుద్దేశించి మంత్రి కొలుసు పార్థసారధి ఇచ్చిన హామీల నేపథ్యంలో కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ప్రధాన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని నేతలు పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, జర్నలిస్టులకు కార్మిక బీమా సదుపాయం, వర్కింగ్ జర్నలిస్టు సంక్షేమ నిధి ఏర్పాటు, జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీతోపాటు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, సిఆర్ మీడియా అకాడమీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో తదనుగుణంగా జిల్లాల్లో సమాచార శాఖను బలోపేతం చేసి జర్నలిస్టులకు అవసరమైన సదుపాయాల కల్పన, జర్నలిస్టుల స్థితిగతుల అధ్యయనం కోసం మీడియా కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ సారధ్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక పునరుద్ధరణ, వృద్ధాప్యంలోని జర్నలిస్టులకు వృద్ధాశ్రమ నిర్మాణం తదితర సమస్యల పరిష్కరించాలని కోరారు. విజయవాడ లోని ఐఅండ్‌పిఆర్, కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించిన వారిలో ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి.ఆంజనేయులు, ఎపిబిజెఎ రాష్ట్ర కన్వీనర్ వి.శ్రీనివాసరావు, ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.బి.నాథన్, ఎం.శ్రీనివాసరావు, కె.కలిమిశ్రీ, రాష్ట్ర నాయకులు షేక్ ఖాజావలి, వి.సురేష్, ఎపిబిజెఎ నాయకులు అలీమ్ ఉన్నారు.








కామెంట్‌లు (0)