ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జూనియర్‌ ‌డాక్టర్ల ఆందోళన ఉధృతం

1 గంట క్రితం

juda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 10:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- నేటి నుంచి అత్యవసర సేవలు నిలిపివేత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ర్టంలో జూనియర్‌ ‌డాక్టర్ల(జూడా) ఆందోళన ఉధృతం కానుంది. ఈ నెల 10వ తేది నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపి సేవలను నిలిపివేసిన జూడాలు సోమవారం నుంచి ఇక అత్యవసర సేవలను కూడా నిలిపివేయనున్నారు. స్టయిఫండ్‌ ‌పెంచి అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జూనియర్‌ ‌డాక్టర్స్‌ అసోసియేషన్‌ దశలవారీగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళలనపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుత్వం నుంచి ఏటువంటి హామీ రాకపోవడంతో సోమవారం నుంచి అత్యవసర వైద్య సేవలను జూడాలు నిలిపివేయనున్నారు. ఇంటర్స్న్‌, జూనియర్‌ ‌రెసిడెంట్స్‌, సూపర్‌ ‌స్పెషాల్టీ పోస్ట్‌ ‌గ్రాడ్యుయేట్స్‌, డిఆర్‌పి, పెరిఫెరల్‌ ‌పోస్టింగ్‌‌లలో ఉన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌, సీనియర్‌‌ రెసిడెంట్స్‌ ‌తదితరులు ఆందోళనలో భాగస్వాములు కానున్నారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా స్టయిఫండ్‌ ‌30శాతం పెంచాలని జూనియర్‌ ‌డాక్టర్లు(జూడా) రాష్ట్రప్రభుత్వాన్ని సుమారు మూడేళ్ల నుంచి కోరుతున్నారు. 15శాతం పెంచుతామని 2024లో కూటమి ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ‌కార్యాలయం నుంచి 5శాతం పెంపు, 15శాతం పెంపు రెండు ప్రతిపాదనలకు సంబంధించిన బడ్జెట్‌ అంచనాలను పంపాలని కోరినట్లు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ‌డైరెక్టర్‌ ‌జూడా అసోసియేషన్‌‌తో జులై 20వ తేదిన జరిగిన చర్చల సందర్భంలో తెలిపారు. అయితే ఇప్పటివరకు స్టయిఫండ్‌ పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకోకపోవడంతో జూడాలు ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం నుంచి హామీ రాకపోవడంతో అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తున్నామని అసోసియేషన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు ఈశ్వర్‌ ‌శంకర్‌, బి దినకర్‌ సాయిశ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు జి భార్గవసాయి నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టయిఫండ్‌ ‌సవరణపై అనేక నెలలుగా పలుమార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కోరినా ఇప్పటివరకు స్పష్టమైన, లిఖితపూర్వక, కాలపరిమితితో కూడిన నిర్ణయం తమకు అందలేదని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక, కాలపరిమితితో కూడిన హామీ ఇవ్వాలని కోరారు. సమస్య మరింత తీవ్రతరం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. వైద్య సేవలు సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమ్మెకు సిపిఎం, సిపిఐ ఇప్పటికే మద్దతు తెలిపాయి. తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్న జూడాల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వైద్యులతో చర్చించి పరిష్కరించాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం డిమాండ్‌ ‌చేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్