రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
అర్హులందరికీ పరిహారం ఇవ్వాలని తీర్మానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వెలుగొండ నిర్వాసితులను బలిపెట్టొద్దని, పూర్తి పరిహారం, పునరావాసం తరువాతనే వారిని గ్రామాల నుండి తరలించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయాలని, మద్దతుగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడ బాలోత్సవ భవన్లో బుధవారం జరిగింది. ఈ సమావేశానికి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎవరి కోసం ఇంత తొందరపాటని ప్రశ్నించారు. నిర్వాసితులకు పూర్తి పరిహారం, పునరావాసం కల్పించిన తరువాతనే గ్రామాల నుండి తరలించాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి, ముఖ్యమంత్రి మెహర్బాణీ కోసం ఈ తతంగం నడిపిస్తున్నారని విమర్శించారు. సాగునీటి రంగ నిపుణులు తుంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శ్రీశైలంలో నీళ్లు లేకుండా వరద జలాలపై ఆధారపడ్డ వెలిగొండకు నీళ్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పంట కాలువలు లేకుండా నీళ్లు ఎవరికిస్తారో చెప్పాలన్నారు. నిర్వాసితులను ముంచే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడుతూ.. అర్హులైన నిర్వాసితులను జాబితాలో చేర్చకుండా వారిని మోసం చేస్తున్నారని తెలిపారు. కొన్ని గ్రామాల్లో దళితవాడలను పూర్తిగా వదిలేశారని, వారిని నిర్వాసితుల జాబితాలో కూడా చేర్చడం లేదని అన్నారు. నిర్వాసిత ప్రాంతాల్లో వైసిపి, టిడిపి నాయకులు కుమ్మక్కై పేదలను మోసం చేస్తున్నారని తమ సర్వేలో తేలిందన్నారు. అధికార పార్టీ నాయకులు కట్టుబట్టలతో నిర్వాసితులను తరిమేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకవైపు ప్రాజెక్టుల్లో నీరు లేదని చెబుతూనే వెలిగొండకు ఇస్తామని చెబుతున్నారని, ఈ నీటిని ఎక్కడ వినియోగిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆ ప్రాంతంలో గొర్రెలు, మేకల పెంపకందారులు వాటిని తక్కువ రేటుకు అమ్మేసుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండంచర్ల, గొట్టిపడియ గ్రామాల్లో నిర్వాసితులను అసలు గుర్తించలేదని, రికార్డులు కూడా సరిగ్గా లేవని, సంక్షేమ పథకాలు అందించడం లేదని అన్నారు. కలెక్టరయితే డేరాలు వేసుకుని బతకాలని ఉచిత సలహా ఇచ్చారని, కలెక్టర్ ఒక్కరోజయినా డేరాలో ఉండగలరా? అని ప్రశ్నించారు. మహిళలకు కనీస అవసరాలు ఉంటాయని, వాటిని ఎలా తీర్చుకుంటారో చెప్పాలన్నారు. వి కృష్ణయ్య మాట్లాడుతూ.. వెలిగొండ పేరుతో నిర్వాసితులను జలసమాధి చేసేందుకు సిఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకరరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. సిఎం ప్రచారయావతో 24న నీటిని విడుదల చేస్తామంటు న్నారని, అక్కడి ప్రజలను జలసమాధి చేయడం కోసమే ఈ తంతు నడుపుతున్నారని అన్నారు. నిర్వాసితులకు కనీస పరిహారం ఇవ్వకుండా, కాలనీల్లో ఇళ్లు నిర్మించకుండా తరిమేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. 7,500 మంది నిర్వాసితులుంటే 2,200 మందినే గుర్తించామని చెప్పడం అన్యాయమని తెలిపారు. ఆ ప్రాంతంలో 1,600 మంది యువతీ యువకులు 18 ఏళ్లు నిండినవారున్నా వారికి పరిహారం ఇవ్వకుండా 2013 భూసేకరణ చట్టాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. వెలిగొండ నిర్వాసితులకు కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం హరిబాబు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇరిగేషన్ రంగ ప్రముఖులు అక్కినేని భవానీ ప్రసాద్ మాట్లాడుతూ.. నిర్వాసితులకు న్యాయం చేసిన తరువాతే నీళ్లు వదలాలనేది సహజ న్యాయసూత్రమని, దీన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. ఎంసిపిఐయు నాయకులు ఎం వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. ప్రత్యేకాధికారిని నియమించి వెలిగొండలో నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి ప్రజల బాధలు తెలియడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ప్రజలకు వసతులు కల్పించాలని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ ఐద్వా రాష్ట్ర కమిటీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సిఐటియు రాష్ట్ర సహాయ కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ.. నిర్వాసితులకు న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల సంఘం నాయకులు బాలనాగయ్య మాట్లాడుతూ.. వెలిగొండ నిర్వాసితుల పట్ల రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు కలిసి రావడం పట్ల అభినందనలు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని అన్నారు. కెవిపిఎస్ నాయకులు చింతల శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు జొన్నా శివశంకర్, డి వెంకటరెడ్డి, రైతు మహాసభ నాయకులు హరినాథ్, ప్రైవేటు టీచర్ల సంఘం నాయకులు సూర్యారావు తదితరులు మాట్లాడారు. అనంతరం తీర్మానాన్ని ఏక్రగీవంగా ఆమోదించారు.








కామెంట్‌లు (0)