- ఎపి వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడిందని ఎపి వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ శుక్రవారం తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న ఎపికి సంబంధించిన 79 బండిళ్లలోని 3,503 ఫైళ్లు, 4,050 సర్వే కమిషనర్ నివేదికలు, రెండు అధికారిక గెజెట్ సంపుటాలు, ఇతర అత్యంత విలువైన చారిత్రాత్మక రికార్డులను తెలంగాణ వక్ఫ్ బోర్డు అధికారికంగా, రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు అప్పగించిందన్నారు. ఇది కేవలం రికార్డుల బదిలీ కాదని, వక్ఫ్ ఆస్తుల హక్కులను పరిరక్షించే కీలక ఆధారాలు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి లభించిన చారిత్రాత్మక ఘట్టమన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఈ రికార్డుల లభ్యత లేకపోవడంతో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, యాజమాన్య హక్కుల నిర్ధారణ, ఆక్రమణల తొలగింపు, న్యాయపరమైన వ్యవహారాల నిర్వహణ వంటి అనేక కీలక అంశాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడం తన బాధ్యతగా భావించి, ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, నిరంతర అనుసరణతో ఈ లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. తెలంగాణ వక్ఫ్ బోర్డ్ నుంచి ఎపికు రూ.55 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, వాటిని త్వరలో విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ రికార్డుల ద్వారా వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధమైన గుర్తింపు, హక్కుల పరిరక్షణ, న్యాయపరమైన కేసుల నిర్వహణ, భవిష్యత్ పరిపాలన మరింత బలోపేతం అవుతుందన్నారు.








కామెంట్‌లు (0)