శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దిమాగీ నక్సల్స్‌

1 గంట క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:27 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

• ఎర్రకోట సాక్షిగా ప్రధాని నోట కొత్త మాట! • స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావన

• దేశానికి కొత్త శత్రువులంటూ అభివర్ణన • వికసిత భారత్‌ కోసం సప్తధార

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: ప్రజా ఉద్యమకారులను, ప్రశ్నించే గొంతులను, రాజకీయ ప్రత్యర్థులను ‘అర్భన్‌‌ నక్సలైట్లు’ అంటూ ఇప్పటి వరకు అనేక రకాలుగా వేధించిన కేంద్ర ప్రభుత్వం మరింత విస్తృతంగా అణచివేత చర్యలకు సిద్ధమవుతోందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఆ దిశలో అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్స్‌’ (నక్సలైట్ల మనస్తత్వం ఉన్న వ్యక్తులు) అంటూ కొత్త మాటను ప్రస్తావించారు. అంతటితో ఊరుకోని ఆయన వారిని ‘దేశానికి కొత్త శత్రువులు’ అని అభివర్ణించారు. వారిని ఒంటరి పాటు చేయాలని చెప్పారు. ‘అడవుల్లోని సాయుధ నక్సలైట్లను నిర్మూలించాం. ఆ సంక్షోభం నుండి దేశాన్ని విముక్తి చేయడంలో విజయం సాధించాం. సాయుధ నక్సలైట్లు కనుమరుగైనా దిమాగీ నక్సల్స్‌ ‌మిగిలే ఉన్నారు. మావోయిస్టు భావజాలం ఉన్న ఆ వ్యక్తులు సమాజంలో బలంగా పాతుకుపోయారు. అధికార పీఠాల్లో కూడా వారికి స్థానం ఉండేది. ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా ఉండేవారు. మావోయిస్టు ఆలోచనా విధానం విధానాలను ప్రభావితం చేసింది. వివిధ రంగాల్లోకి చొరబడిన వారు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. హింస, అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దిమాగీ నక్సల్స్‌‌ను గుర్తించాలి. ఒంటరి పాటు చేయాలి. యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి’ అని ప్రధాని అన్నారు. జెన్‌ ‌జెడ్‌ ఉద్యమంతోపాటు దేశ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో ఎర్రకోట సాక్షిగా ప్రధాని నోట వెలువడిన ఈ మాటలు చర్చనీయాంశంగా మారాయి. ప్రశ్నించే వారిపై మరింతగా అణచివేత చర్యలు తప్పవన్న సంకేతాలు ఇస్తూనే యువతను ఆకట్టుకోవడానికి పలు అంశాలను కూడా ప్రధాని ప్రకటించారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని అన్నారు. వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికను ప్రకటించారు. తయారీ శక్తి, ఫుడ్ ప్రొడక్షన్, టెక్నాలజీ, గతిశక్తి, రక్షణ రంగం, గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ, యువశక్తి అని అన్నారు.‘భార‌త్‌లో ప్ర‌స్తుతం సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల స్టార్ట‌ప్‌లు ఉన్నాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఎఐ ఇంపాక్ట్ స‌ద‌స్సును నిర్వ‌హించింది. రాబోయే సంవ‌త్స‌ర కాలంలో దేశంలోని కోటి మంది యువ‌త‌కు ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాన్ని నేర్పించ‌నున్నాం’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా ‘వందే మాతరం’ నినాదం మార్మోగుతోందని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డీలిమిటేష‌న్‌తో లింకున్న మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించడానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఆ త‌రువాత ఆ అంశంలో క్రెడిట్ తీసుకోవాల‌ని ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌ధాని మోడీ కోరారు. గ‌త 40 ఏళ్ల నుంచి మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అంశం రాజ‌కీయ అకాడాలో ఉండిపోయింద‌న్నారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని, అసెంబ్లీలు.. లోక్‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అమ‌లు చేసి మ‌హిళ‌ల‌ను గౌర‌వించాల‌న్నారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం పోటీపడుతోందని చెప్పారు. ఆ ఒలింపిక్స్‌‌లో కనీసం ముప్పావు వంతు అంశాలలో క్రీడాకారులు పాల్గొనాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతిభావంతులను గుర్తించడానికి, 5 నుంచి 15 ఏళ్ల పిల్లల కోసం దేశవ్యాప్త ప్రతిభాన్వేషణను ప్రారంభిస్తున్నాం. ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం” అని అన్నారు.

వరుసగా 13వ సారి పతాకావిష్కరణ

ప్రధాన మంత్రి హోదాలో నరేంద్రమోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఆయన జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ఆర్మీ బ్యాండ్‌తో వందేమాత‌రం గీతాన్ని ఆల‌పించారు. తొలుత‌ 21 గ‌న్ సెల్యూట్ చేశారు. 1721 ఫీల్డ్ బ్యాట‌రీ సెర్మోనియ‌ల్ గ్రూపు ఈ సెల్యూట్ నిర్వ‌హించారు. 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గ‌న్స్ వాడారు. ఎర్ర‌కోట‌ వేదిక‌పై రెండు ఎంఐ-17 హెలికాప్ట‌ర్లు పూల‌వ‌ర్షం కురిపించాయి. ఓ హెలికాప్ట‌ర్ జాతీయ ప‌తాకాన్ని మోసుకెళ్లింది. మ‌రో హెలికాప్ట‌ర్ వందేమాత‌రం గీతం రాసిన జెండాను తీసుకెళ్లింది. దేశానికి స్వాతంత్య్ర‌ వ‌చ్చిన త‌రువాత‌ మొద‌టిసారి పూర్తిగా వందేమాత‌రం గీతాన్ని ఎర్ర‌కోట వ‌ద్ద ఆల‌పించారు. ప్రధాని ఎరుపు రంగుతో కూడిన సాంప్రదాయ రాజస్థానీ బాంధనీ తలపాగాను, తెల్లటి కుర్తా, గోధుమ రంగు కలిగిన కోట్‌ను ధరించారు. జేబులో జాతీయ జెండా రంగులతో కూడిన ‘పాకెట్ స్క్వేర్’ను ప్రత్యేకంగా అలంకరించుకున్నారు.


ప్రశ్నించే వారిపై దాడికి మోడీ ప్రభుత్వ ప్రణాళిక

- సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “దిమాగీ నక్సల్” అంటూ చేసిన వ్యాఖ్య వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులపై, ప్రశ్నలు లేవనెత్తే వారందరిపై ఆయన ప్రభుత్వం దాడి చేయడానికి ప్రణాళిక రచిస్తోందని స్పష్టం చేస్తోంది. ఇది ప్రజాస్వామ్య హక్కులకు, పౌర స్వేచ్ఛలకు పెద్ద ముప్పు. ప్రతిపక్షంలోని వారిని దేశద్రోహులుగా నిందించాలని వారు ఎప్పుడూ చూస్తుంటారు. వారి మనసులో మావోయిస్టులు అనే ఆరోపణ వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది ఒక దారుణమైన ఆరోపణ. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనకు ముడిపెట్ట కుండా, ఉన్న సీట్లలోనే కోటాను అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్