మహారాష్ట్రలోని అమరావతి జిల్లా డోమా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో దెయ్యాలు తిరుగుతున్నాయన్న ప్రచారం 608 మంది విద్యార్థులను హాస్టల్ వదిలి ఇళ్లకు వెళ్లేలా చేసింది. వారంతా 1 నుంచి 10వ తరగతి వరకు చదివే ఆదివాసీ విద్యార్థులు. అర్ధరాత్రి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని కొంతమంది బాలికలు చెప్పడంతో మొదలైన భయం, తరువాత “హాస్టల్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయి” అనే వదంతిగా మారింది. కొంతమంది విద్యార్థినులు భయంతో అరవడం, స్పృహ తప్పడం వంటి సంఘటనలు జరిగాయి. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
భయం ఎలా విస్తరిస్తుంది?
ఒకసారి భయం మొదలైతే, దాని చుట్టూ అపోహలు అలముకుంటాయి. సాధారణ శబ్దాన్నే ప్రమాదంగా భావించవచ్చు. ఒకరి భయానికి మరొకరి భయం తోడై వదంతి అందరినీ చుట్టేస్తుంది. భయంతో గుండె దడ, వణుకు, చెమటలు, తల తిరగడం, శ్వాస వేగం పెరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు రావొచ్చు. ఇవి నటన అని అనుకోకూడదు. కారణం తెలుసుకోకుండానే దాన్ని దెయ్యాల ప్రభావంగా ప్రచారం భావించకూడదు.
హాస్టల్‌లో విద్యార్థులు కుటుంబానికి దూరంగా ఉండటం, చదువు ఒత్తిడి, ఒంటరితనం, నిద్రలేమి వంటి కారణాలతో మానసిక ఒత్తిడికి గురై ఉండవచ్చు. ఒక విద్యార్థి భయపడటం లేదా స్పృహ కోల్పోవడం చూసి ఆ భయం ఇతరులకూ వ్యాపించవచ్చు. సోషల్ మీడియా, వాట్సాప్‌లో ఆధారం లేని సందేశాలు ఈ భయాన్ని మరింత పెంచుతాయి. అందుకే మనకు ఏదైనా విచిత్రంగా అనిపిస్తే వెంటనే నమ్మేయకుండా, “అసలేం జరిగింది? దానికి భౌతిక, వైద్య లేదా మానసిక కారణం ఏమిటి?” అని ఆలోచించాలి.
మనం ఏం చేయాలి?
ఏదైనా విచిత్రమైన శబ్దం వినిపించినా వెంటనే “దెయ్యం” అని అనుకోకూడదు. దానికి సాధారణ కారణం ఏదైనా ఉందా అని ఆలోచించాలి. ఎవరో చెప్పారని నమ్మకూడదు. మనం విన్నది, చూసింది, నిజంగా జరిగినదేనా అని ఆలోచించాలి.
భయపెట్టే వీడియోలు, ఆడియోలు, సందేశాలను ఇతరులకు పంపకూడదు. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతి విషయాన్నీ నిజమని భావించకూడదు. భయం ఎక్కువైతే ఒంటరిగా ఉండకుండా ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దవారితో మాట్లాడాలి. ఏ విషయాన్నైనా ప్రశ్నించడం, పరిశీలించడం, ఆధారాలను వెతకడం అలవాటు చేసుకోవాలి. భయానికి మందు మరింత భయపడడం కాదు; వాస్తవం ఏమిటో తెలుసుకోవటం!
- బాలమిత్ర







కామెంట్‌లు (0)