శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మోడీ సర్కారు నిర్లక్ష్యంతో సర్కారు విద్య కుదేలు

1 గంట క్రితం

schools
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 01:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- హయ్యర్ సెకండరీలో చేరకముందే 73 శాతం మంది విద్యార్థులు డ్రాపౌట్‌

- కేటాయింపుల ఖర్చులోనూ ఘోర వైఫల్యం

- పార్లమెంటరీ కమిటీ నివేదికతో కేంద్రం విద్యా విధానంపై తీవ్ర ప్రశ్నలు

న్యూఢిల్లీ : దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల పరిస్థితిపై పార్లమెంటరీ అంచనా కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా స్థాయి పెరిగే కొద్దీ పాఠశాలల సంఖ్య, విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతోంది. ఫలితంగా దాదాపు 73 శాతం మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పూర్తి చేయకముందే చదువు మానేస్తున్నారని కమిటీ తన పదో నివేదికలో వెల్లడించింది. బడ్జెట్ కేటాయింపులు, నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) గురించి మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ… క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఈ నివేదిక పరోక్షంగా తేటతెల్లం చేసింది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యుడిఐఎస్‌ఇ) 2024-25 గణాంకాల ప్రకారం… దేశంలో మొత్తం 10,92,671 ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 9,11,032 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సెకండరీ స్థాయికి వచ్చేసరికి ఈ సంఖ్య 1,61,808కు, హయ్యర్ సెకండరీ స్థాయిలో కేవలం 90,866కు మాత్రమే పరిమితమయ్యాయి. పిల్లలు పై తరగతులకు వెళ్లే కొద్దీ పాఠశాలలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్య ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. ప్రాథమిక తరగతుల్లో 6.18 కోట్ల మంది చదువుతుండగా… అప్పర్ ప్రైమరీలో అది 4.08 కోట్లకు పడిపోయింది. సెకండరీలో 2.36 కోట్లకు, హయ్యర్ సెకండరీలో 1.64 కోట్లకు చేరింది. ఈ గణాంకాల ఆధారంగా దాదాపు 73 శాతం మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ పూర్తి చేయకముందే చదువు నుంచి తప్పుకుంటున్నారని కమిటీ పేర్కొంది.

హక్కుల చట్టం, ఎన్‌ఇపి అమలు ఎక్కడ?

వికలాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం 18 ఏళ్ల వయసు వరకు ఉచిత విద్య హక్కు కల్పించాల్సి ఉండగా, జాతీయ విద్యా విధానం–2020 (ఎన్‌ఇపి) ‘‘జీరో రిజెక్షన్ పాలసీ’’ని అమలు చేయాలని చెప్తున్నా… ఆ లక్ష్యాలు కాగితాలకే పరిమితమయ్యాయని కమిటీ వ్యాఖ్యానించింది. బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించడం, ప్రత్యేక ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయడం, ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాన్ని వేగవంతం చేయాలని కేంద్ర విద్యాశాఖకు కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

​ విద్యపై అనేక నినాదాలు… క్షేత్రస్థాయిలో కఠిన వాస్తవాలు

భారీ నినాదాలతో కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, గ్రామీణ, అణగారిన విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తేవడంలో ఎలాంటి పురోగతి లేదని పార్లమెంటరీ కమిటీ నివేదిక చెబుతోంది. పాఠశాలల కొరత, భారీ డ్రాపౌట్‌లు, వికలాంగ విద్యార్థులకు కనీస సౌకర్యాల లేమి, కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించలేక పోవడం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని విద్యావేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వికలాంగ విద్యార్థులకు కనీస వసతులూ లేవు

​దేశంలో సగానికిపైగా పాఠశాలల్లో వికలాంగ విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కూడా లేవని కమిటీ పేర్కొంది. దేశవ్యాప్తంగా 14.71 లక్షల పాఠశాలల్లో 5.23 లక్షల పాఠశాలల్లోనే ప్రత్యేక మరుగుదొడ్లు ఉండగా, 8.08 లక్షల పాఠశాలల్లోనే ర్యాంపులు, హ్యాండ్‌రెయిల్స్ ఉన్నాయి.

నిధులు కేటాయించి ఖర్చు చేయని కేంద్రం

సమగ్ర శిక్ష పథకం కింద 2024-25లో 186 ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.482 లక్షలు కేటాయించినప్పటికీ, అందులో రూ.2.60 లక్షలు మాత్రమే ఖర్చు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని కమిటీ పేర్కొంది. ప్రత్యేక విద్యా బోధకుల నియామకానికి రూ.962 లక్షలు కేటాయించినా.. ఖర్చు చేసినది రూ.80.50 లక్షలు మాత్రమే కావడం అమలు వైఫల్యాన్ని బయటపెట్టిందని వివరించింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్