- అటవీశాఖకు అందని ట్రాకర్ సిగ్నల్స్
ప్రజాశక్తి - పోలవరం గత నెల రోజులుగా పాపికొండల అభయారణ్యం పరిధిలో ఉన్న ముంపు గ్రామాల్లో బస చేసిన పెద్దపులి ఆదివారం తెల్లవారుఝామున గేదె, గేదె దూడపై దాడి చేయడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకునే ట్రాంక్విలైజర్ పరికరాలతో రెస్క్యూ బృందాలు, షూటర్స్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే, ఆదివారం రాత్రి పెద్దపులి ఆ ప్రాంతం నుండి దిశ మార్చుకుని తోటగొంది జంటగుహలు ప్రాజెక్టు 902 ఎస్ కటింగ్ పాండురంగడి ఆలయ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాలు పోలవరం మండల కేంద్రం పైడిపాక, చంద్రన్న కాలనీ, ఎన్‌టిఆర్ కాలనీ, ప్రాజెక్టు కుడి కాలువ, ఇటుకలకోట గ్రామాలకు దగ్గరగా ఉండడం, గతంలో ఇటుకలకోటలో పెద్దపులి ఒక గేదెపై దాడి చేసి చంపడం, ప్రాజెక్టు కుడి కాలువ ప్రాంతాల్లో సంచరించడం వంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయంపై అటవీక్షేత్రాధికారి ఎస్ కె వలీని వివరణ కోరగా పులి మెడకు అమర్చిన ట్రాకర్ సిగ్నల్స్ అందుబాటులో లేవని, అటవీశాఖ, రెస్క్యూ బృందాలు పులిని పట్టుకోవడానికి డ్రోన్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రయత్నిస్తున్నారని, పులి కనిపించినా, సంచారం జాడలు కనిపించినా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.








కామెంట్‌లు (0)