- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంకణాలు ఆంజనేయులు పిలుపు
ప్రజాశక్తి-టంగుటూరు : సమాజం ఆధునిక యుగంలోకి పరుగులు తీస్తున్నా, అనాగరికమైన కుల వివక్షత నేటికీ కొనసాగడం సిగ్గుచేటని, సామాజిక ఉద్యమాలతో దానికి అడ్డుకట్ట వేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి కంకణాలు ఆంజనేయులు పిలుపునిచ్చారు. కేవిపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 20, 21 తేదీలలో జిల్లా వ్యాప్తంగా జరిగే సామాజిక శంఖారావం బైక్ యాత్ర గురువారం టంగుటూరు బొమ్మల సెంటర్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు గడుస్తున్నా, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్ళు గడిచినా వాటి ప్రధాన లక్ష్యాలు నేటికీ నెరవేరలేదని అన్నారు. సమానత్వం, సోదర భావం, లౌకికతత్వం, సామ్యవాద వ్యవస్థ సాధించాలనే ఉన్నతమైన ఆశయాలు మన రాజ్యాంగంలో ఉన్నాయని అన్నారు. అవి నెరవేరకపోగా కనుమరుగయ్యే ప్రమాదం నేడు ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు రక్షణ లేకుండా పోయిందని, ఆ చైతన్యాన్ని సమర్థించకపోగా కుటుంబ సభ్యులే అమానుషంగా హత్యాకాండకు పాల్పడే విషాదకరమైన పరిణామాలు మనం చూస్తున్నామని అన్నారు. దళితులుగా పుట్టినప్పటి నుండి మరణించే వరకు అనేక రూపాలలో వివక్షత గురవుతున్నారని చివరకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని అన్నారు. దళితవాడలకు స్మశానాలు లేవని, ఉన్నవి ఆక్రమణలకు గురయ్యాయని చనిపోయిన కళేబరాలను వాగుల్లో వంకల్లో కుంటల్లో పూడ్చుకోవాల్సిన దయనీ స్థితి ఉందని అన్నారు. జి ఓ. నెంబర్ 1235 ప్రకారం స్మశానాలు లేని దళితవాడలన్నింటికీ రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి, అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా, ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే కుట్రలు పాలకులు చేయడం విచారకరమని అన్నారు. ఈ సామాజిక సమస్యలపై సమరశీల పోరాటాలకు ప్రజాసంఘాలు పిలుపు నిచ్చాయని, ప్రజాతంత్ర వాదులందరూ వీటికి మద్దతు ఇవ్వాలని కోరారు.
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బొమ్మతోటి రఘురాం మాట్లాడుతూ దళితవాడలో అభివృద్ధి కోసం కేటాయించిన స్పెషల్ కాంపోనెంట్ నిధులు పక్కదారి పడుతున్నాయని అన్నారు. ఒకవైపు కులం పేరుతో సామాజిక వివక్షత కొనసాగుతుండగా, మరొకవైపు దళిత వాడలు అభివృద్ధిలో వివక్షతకు గురవుతున్నాయని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, మంచినీళ్లు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు నేటికీ దళితవాడలు నోచుకోకపోవడం విచారకరమని అన్నారు. సామాజిక సమస్యలపై ఈ నెల 24వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ముట్టడిలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వేసుపోగు మోజస్ అధ్యక్షత వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జగజీవన్ రావు విగ్రహానికి కంకణాల ఆంజనేయులు పూలమాలలు వేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి జెండాలు ఊపి జాతాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు టి.రాము, వి.బాలకోటయ్య, జి వి. బి కుమార్, బంకా సుబ్బారావు, సిహెచ్ వినోద్, పల్లాపల్లి ఆంజనేయులు, గుడిపూడి అంకయ్య, టంగుటూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)