మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్బన్‌ లోకల్‌ బాడీల్లో ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి, మహిళా ఓటర్ల జాబితా

2 రోజుల క్రితం

voter list
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 08:54 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- కార్పొరేషన్ల ఎన్నికల నియమావళి విడుదల

- నామినేషన్‌ ఫీజు రూ.5000

- బిసి, ఎస్‌‌సి, ఎస్‌‌టిలకు రూ.2500

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయింది. మేయర్‌ ఎన్నికతోపాటు ఈసారి ఒక డిప్యూటీ మేయర్‌‌ను మాత్రమే ఎన్నుకునేలా విధివిధానాలు రూపొందించారు. విజయనగరం కార్పొరేషన్‌‌తోపాటు మరో 58 అర్బన్‌ ‌లోకల్‌ ‌బాడీల్లో ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి, మహిళా ఓటర్లను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. కోర్టు కేసులు ఉన్న లోకల్‌ ‌బాడీల్లో అవి పరిష్కారం అయిన తరువాత ఇదే పద్దతి అనుసరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన నియమావళిపై శనివారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ ఉత్తర్వులు విడుదల చేశారు. కొత్తగా జారీ అయిన విధివిధానాలను 'ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల (మేయర్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ) నియమాలు, 2026' పేరుతో పిలవనున్నారు. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న మేయర్‌, ఇద్దరు డిప్యూటీ మేయర్ల స్థానంలో ఈసారి ఒక డిప్యూటీ మేయర్‌ ఉండే విధంగా మార్పులు చేశారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ ఇదే ఛైర్మన్‌‌తోపాటు ఒక ఛైర్‌ ‌పర్సన్‌ ఉండేలా మార్పులు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. సాధారణ అభ్యర్థులు నామినేషన్ దాఖలు ఫీజును రూ. 5,000గా నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు డిపాజిట్ రూ. 2,500గా నిర్ణయించారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఎన్నిసెట్లు దాఖలు చేసినా ఒకేఫీజు సరిపోతుందని నిబంధనల్లో పేర్కొన్నారు.

ఫీజును నగదు రూపంలో నేరుగా రిటర్నింగ్ అధికారికి చెల్లించొచ్చని, అలాగే ఎస్‌‌బిఐ, ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేసిన రసీదును నామినేషన్ పత్రానికి జతపరచవచ్చని తెలిపారు. అభ్యర్థి తన పేరు స్వయంగా రాయలేని పక్షంలో, కమిషనర్ లేదా రిటర్నింగ్ అధికారి సమక్షంలో ప్రత్యేక గుర్తును ఉంచి, ఆ అధికారి ధృవీకరిస్తే దానిని సంతరంగా పరిగణిస్తారని తెలిపారు. పాత నిబంధనలన్నింటినీ తక్షణం రద్దు చేసినట్లు వివరించారు. సెప్టెంబర్ 8 నుండి 59 యుఎల్‌బిలలో ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టిన అనంతరం వారం రోజుల్లోపు ప్రకటించనున్నట్లు తెలిపారు. మేయర్లు, ఛైర్మన్లను నేరుగా ఎన్నుకోవడంతోపాటు డిప్యూటీ మేయర్‌, వైస్‌ ‌ఛైర్మన్లను ఎన్నికైన అభ్యర్థుల ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్ మొదటి సమావేశం జరిగిన 15 రోజుల లోపు, ఓటు వేయడానికి అర్హులైన సభ్యులకు కనీసం మూడు రోజుల స్పష్టమైన నోటీసుతో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ వైస్-చైర్‌పర్సన్ కోసం కూడా ఇదే విధమైన నిబంధనలు ఉంటాయని తెలిపారు.

59 యుఎల్‌‌బిల్లో ఓటర్ల గుర్తింపునకు 14 రోజలు షెడ్యూలు

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌‌తో పాటు 58 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలతో కూడిన మొత్తం 59 అర్బన్ లోకల్ బాడీలలో ఎస్‌‌సి, ఎస్‌‌టి, బిసి, మహిళా ఓటర్లను గుర్తించడానికి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుండి 21వ తేదీ వరకూ 14 రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు. షెడ్యూల్ ప్రకారం, ఎస్‌సి, ఎస్‌‌టి, బిసి ఓటర్ల ఇంటింటి గుర్తింపు సర్వే సెప్టెంబర్ ఎనిమిది నుండి 12 వరకు జరుగుతుందని, సెప్టెంబర్ 13న గుర్తించబడిన ఓటర్ల జాబితాను 13వ తేదీన సిద్ధం చేసి 14న ప్రచురిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 15 నుండి 17 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న అభ్యంతరాల క్రమబద్ధీకరణ వెరిఫికేషన్ అధికారుల శిక్షణ ఉస్తారని వెల్లడించారు. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో క్షేత్రస్థాయి పరిశీలన, అభ్యంతరాలను పరిష్కరిస్తారని జిఓలో తెలిపారు. సెప్టెంబర్ 21న కేటగిరీల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించిస్తారని తెలిపారు. మిగిలిన 41 యుఎల్‌బిలలో సరిహద్దుల విభజనకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అనుగుణంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. వారం రోజుల్లో ఓటర్ల జాబితా పూర్తవుతుందని అనంతరం రిజర్వేషన్ ఇతర ఎన్నికల ప్రక్రియలను ముందుకు తీసుకువెళతారని తెలిపారు. వీటితోపాటు హైకోర్టు పరిశీలనలో 23 యుఎల్‌బిలలో, హైకోర్టు తుది తీర్పు వెలువడిన వెంటనే సరిహద్దుల విభజన, ఓటర్ల జాబితాను పూర్తి చేసి ఎన్నికల ప్రక్రియ చేపడతామని వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్