రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
ప్రజాశక్తి-అమరావతి : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సవరణ ప్రక్రియలో ఓటు కోల్పోయిన వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉండటంతో తుది ఓటర్ల జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. సవరణ ప్రక్రియ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహిస్తే పలువురు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాలను ఇప్పటికే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్నందున, వైసిపి పిటిషన్‌ను కూడా ఆ ధర్మాసనం ముందుంచాలని జస్టిస్ వి సుజాత.. రిజిస్ట్రీని మంగళవారం ఆదేశించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుజాత విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్, ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున కనపర్తి అజయ్ వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ అక్టోబర్ 3న పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుందని పిటిషనర్ తరపున న్యాయవాది తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినా, నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో జరిగే మార్పులు, చేర్పులను పరిగణనలోకి తీసుకుని అనుబంధ జాబితా ప్రచురించాలని కోరారు. ప్రభుత్వం తరపున ఎజి స్పందిస్తూ, ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎస్ఐఆర్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎస్ఇసి తరపున న్యాయవాది వాదనలు విన్న అనంతరం పిటిషన్‌ను సిజె ధర్మాసనం ముందున్న స్థానిక ఎన్నికల వ్యాజ్యాలతో జత చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.







కామెంట్‌లు (0)