ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) రాయబారి లీ సియోంగ్ హోను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం నాడిక్కడ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలో కొరియన్ కంపెనీల విస్తరణ, భవిష్యత్తులో ఇరుదేశాల నడుమ మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. సెమీకండక్టర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, స్టోరేజ్, నౌకా నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో కొరియా ప్రపంచ అగ్రగామిగా ఉంది. భారతదేశంలో కొరియన్ కంపెనీలకు ముఖ్యంగా రాష్ట్రం ఏ విధంగా దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదనే అంశంపై మంత్రి లోకేష్ చర్చించారు.
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌కు లోకేష్ సత్కారం
ప్రముఖ సినీనటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాగంటి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌ను మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. 2026 పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించేందుకు ఢిల్లీ చేరుకున్న మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌ను మంత్రి లోకేష్ కలుసుకొని జ్ఞాపికలతో సత్కరించారు. వందలాది సినిమాల్లో నటించి, తెలుగు సినిమా రంగానికే వన్నెతెచ్చిన ఇద్దరు సీనియర్ నటులకు ఒకేసారి పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావుతో తమకు గల సాన్నిహిత్యాన్ని ఇద్దరూ గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి సీనియర్ నటులు సేవలందించాలని లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, పలువురు ఎంపిలు కూడా మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌ను సన్మానించారు.









కామెంట్‌లు (0)