రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం
ప్రజాశక్తి – రాజాం: దీపావళి పండుగ వేళ రాజాం పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని పాలకొండ రోడ్డులో ఉన్న నవదుర్గ ఆటోమొబైల్స్ షాపులో ఆదివారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని కుమార్ తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దీపావళి సందర్భంగా సమీప వీధిలో బాణసంచా కాల్చడంతో వెలువడిన నిప్పురవ్వలు షాపులో పడటంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. షాపులో ఉన్న ట్రాక్టర్ విడిభాగాలు, లూబ్రికేటింగ్ ఆయిల్, గ్రీజు, బెల్టులు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అగ్నిప్రమాదానికి గల పూర్తి కారణాలు విచారణ అనంతరం వెల్లడవుతాయని పి. అశోక్ తెలిపారు.






కామెంట్‌లు (0)