తీవ్రస్థాయికి పడిపోయిన గాలి నాణ్యత.. 406కు చేరిన ఏక్యూఐ
ఢిల్లీ: దీపావళి మరుసటి రోజే దేశ రాజధాని దిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నగరంలో వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 406కు చేరడంతో తీవ్ర కాలుష్య స్థాయికి పడిపోయింది. దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేయడంతో తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోయింది. ఇందర్‌లోక్ ప్రాంతంలో పొగమంచు ప్రభావం అధికంగా కనిపించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం.. తెల్లవారుజామున 4.20 గంటలకు ఐటీఓ ప్రాంతంలో ఏక్యూఐ 406గా నమోదైంది. రాజీవ్ చౌక్‌లో 381, సౌత్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో 360గా నమోదైంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యతతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
మరోవైపు కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) మూడో దశ ఆంక్షలను శుక్రవారం నుంచే అమల్లోకి తెచ్చారు. కాలుష్య నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులు ఆదేశించారు. గాలి నాణ్యత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ అంచనాల ప్రకారం నవంబరు 8, 9 తేదీల్లోనూ ఢిల్లీలో తీవ్ర కాలుష్య పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.







కామెంట్‌లు (0)