- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి
ప్రజాశక్తి - కొండపి: శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వేగంగా ముందుకు పోతున్నా, సమాజంలో అనాగరిక కాలం నాటి కుల వివక్షత కొనసాగటం సిగ్గుచేటని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డిరమాదేవి అన్నారు. సోమవారం కొండపిలోని టంగుటూరు రోడ్డులో గురుకుల పాఠశాల వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడుతూ గత రెండు మాసాలుగా రాష్ట్రవ్యాప్తంగా కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం అనే పేరుతో కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, అనేక ప్రజాసంఘాలు కలిసి అధ్యయన యాత్రలు సాగించామని తెలిపారు. అనేక గ్రామాల్లో పట్టణాల్లోని దళితవాడల్లో నేటికీ సామాజిక వివక్షత కొనసాగుతుందని, అభివృద్ధి పరంగా దళితవాడలో వివక్షతకు గురవుతున్నాయని తెలిపారు. దళితవాడల అభివృద్ధి కోసం కేటాయించిన స్పెషల్ కాంపోనెంట్ నిధులు పక్కదారి పడుతున్నాయని అన్నారు. దళితవాడలకు స్మశాన స్థలం కేటాయించాలని పోరాటాల ద్వారా సాధించిన జీవో నెంబర్ 1235 అమలు కావడం లేదని అన్నారు. పుట్టుకే అవమానం, జీవితమంతా అవమానంతో గడిచిన దళితుల బ్రతుకులు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని, చనిపోయిన శవాలను వాగుల్లో వంకల్లో పూడ్చుకునే దయనీస్థితి నేటికీ కొనసాగుతున్నదని అన్నారు. దళితుల స్మశాన వాటికలు కూడా ఆక్రమణలకు గురయ్యాయని కనీసం బాటలు కూడా కొన్ని చోట్ల లేవని అన్నారు. పట్టణాల్లో కులం పేరు అడిగి, దళితులు అని తెలిస్తే అద్దెకు ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఇంకా ఉన్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫంక్షన్ల సందర్భాలలో వేరుగా భోజనాలు పెట్టే పరిస్థితి నెలకొందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు తీవ్రమయ్యాయని అన్నారు. సనాతన సాంప్రదాయం పేరుతో ఆదిపత్య వర్గాల భావజాలాన్ని నేటికీ బలంగా రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను శిక్షించకుండా పాలకులు వెనకేసుకురావడం అనేది పెరిగిందని అన్నారు. ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో 25 వేలకు పైగా వివక్షతకు సంబంధించిన ఘటనలు జరిగాయని అన్నారు. దోషులకు శిక్ష చాలా పరిమితంగా పడిందని, ఈ పరిస్థితి ఇలాంటి ఘటనలు పెరగటానికి దారితీస్తుందని అన్నారు. ఇవన్నీ రూపుమాపేందుకు కుల వివక్ష పై పోరాడే సంఘాలన్నిటినీ కలుపుకొని విశాల ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అందులో భాగంగా ఈనెల 24వ తేదీన కలెక్టరేట్ వద్ద ముట్టడి, నిరసన, ధర్నా లాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అభ్యుదయ కాముకులంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ కుల వివక్ష నిర్మూలన కోసం రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పడిందని, ఆ సిఫార్సులు నేటికీ అమలు జరగడం లేదని అన్నారు. కుల వివక్ష పాటించిన, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో జిల్లా ఉన్నత అధికారులు పర్యటించాలని ఉన్న నిబంధన అమలు జరగటంలేదని అన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల ప్రకారం భూమిలేని ప్రతి పేద కుటుంబానికి రెండు ఎకరాల భూమి పంపిణీ చేయాలని అన్నారు. ఆర్థిక వెసులుబాటు పెరగడం ద్వారా సామాజిక వివక్షతను కొంతమేరకైనా నివారించగలమని అన్నారు. అందుకు భూ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశాల సందర్భంగా సీనియర్ నాయకులు మొండ్రూ ఆంజనేయులు జండా ఆవిష్కరణ చేశారు.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నెరుశుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కేజీ మస్తాన్, జిల్లా నాయకులు కె. వెంకటేశ్వర్లు, వి మోజస్, యం.ఆంజనేయులు, ఉబ్బ వెంకటేశ్వర్లు, మల్లెల సంపూర్ణ, డి జాన్, అన్నవరపు శేషారావు, పారాబత్తిన శ్రీను, అంగలకుర్తి బ్రహ్మయ్య పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)