- కలెక్టర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశం
- తొమ్మిది జిల్లాలకూ కలిపి ఆర్థిక వ్యవస్థ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు త్వరలో మాస్టర్ ప్లాను రూపొందించనున్నారు. రీజియన్ పరిధిలోని తొమ్మిది జిల్లాలతో కలిపి దీన్ని ఏర్పాటు చేయనున్నారు. తొమ్మిది జిల్లాలతో కూడిన ఒకే ఆర్థిక వ్యవస్థగా అమరావతి ఎకనామిక్ రీజియన్‌ను రూపొందించనున్నారు. దీనికోసం అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని పట్టణాభివృద్దిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ తొమ్మిది జిల్లాల కలెక్టర్లను కోరారు. దీనిపై ఇటీవల రాయపూడి సిఆర్ కార్యాలయంలో ప్రత్యేక ప్రణాళికా సమావేశం నిర్వహించారు. అమరావతి ఆర్థిక ప్రాంతం పరిధిలో ఎన్‌టిఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, మార్కాపురం జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడుతూ అమరావతి ఆర్థిక ప్రాంతానికి సమగ్ర ఆర్థిక మాస్టర్ ప్లాన్‌ను ఆరు నెలల్లో సిద్ధం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ఆర్థిక, పట్టణ ప్రణాళిక నిపుణులతో కూడిన నాలెడ్జ్ పార్ట్‌నర్‌ను ఎంపిక చేసి ఈ ప్రణాళికను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది జిల్లాల ప్రత్యేకతలను పరస్పరం అనుసంధానం చేసి వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు, పారిశ్రామిక రంగం, లాజిస్టిక్స్, పట్టణ ప్రాంతాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల మధ్య బలమైన వృద్ధి ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అంతకుముందు తొమ్మిది జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ధి అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అన్ని శాఖల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను ఒకే ప్రణాళికలోకి తీసుకురావడం ద్వారా ప్రాంతీయంగా సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని అధికారులు వెల్లడించారు. సిఆర్‌డిఎ అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, టి. రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)