- బాధితులకు మెరుగైన వైద్యం.. ప్రత్యేక వైద్య బృందాలతో నిరంతర పర్యవేక్షణ
- భయాందోళన చెందాల్సిన అవసరం లేదు
- పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
పోలవరం జిల్లా(ఏటిపాక) : పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఫీవర్ సర్వేలెన్స్‌లో భాగంగా చేపట్టిన వైద్య శిబిరంలో క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేసిన అనంతరం అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి, వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పరిస్థితికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
గొల్లగుప్ప గ్రామంలో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఫీవర్ సర్వేలెన్స్‌లో భాగంగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. మలేరియా నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ప్రోటోకాల్ ప్రకారం వయస్సుకు అనుగుణమైన మోతాదులో క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేసినట్లు చెప్పారు.
మాత్ర వేసుకున్న అనంతరం జమున (7) అనే బాలిక అపస్మారక స్థితికి చేరుకుని, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గడంతో అస్వస్థతకు గురైందన్నారు. వెంటనే బాలికను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ దురదృష్టవశాత్తూ మృతి చెందినట్లు తెలిపారు.
ముందస్తు జాగ్రత్తగా గొల్లగుప్ప గ్రామానికి చెందిన 54 మందినీ భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు, ప్రస్తుతం 53 మంది (చిన్నారులు 48, పెద్దలు 5) చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ క్రిటికల్ లేదా డేంజరస్ పొజిషన్‌లో లేరని స్పష్టం చేశారు. గ్రామంలో ఉన్న మరో 17 మందికి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని, వారంతా కూడా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
మృతి చెందిన బాలిక జమున (7ఏళ్ళు)కు సంబంధించి వైద్య పరీక్షలు, పోస్టుమార్టం తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక వైద్య పరిశీలనల్లో బాలికకు కుటుంబపరంగా లేదా జన్యుపరంగా గుండెకు సంబంధించిన సమస్య ఉండి ఉండవచ్చని వైద్యులు అంచనా వేసినట్లు చెప్పారు. అటువంటి పరిస్థితిలో క్లోరోక్విన్ వినియోగం వల్ల కార్డియాక్ అరిథ్మియా ఏర్పడి ఉండే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నప్పటికీ, దీనిపై పూర్తి స్థాయి క్లినికల్ నిర్ధారణ రావాల్సి ఉందని స్పష్టం చేశారు.
క్లోరోక్విన్ మాత్రలను వయస్సుకు అనుగుణమైన డోసేజ్ ప్రకారమే పంపిణీ చేసినట్లు తెలిపారు. మందుల నాణ్యతకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన క్వాలిటీ కంట్రోల్ పరీక్షల నివేదికలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. మరింత స్పష్టత కోసం వినియోగించిన క్లోరోక్విన్ మాత్రల బ్యాచ్‌ను వైజాగ్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ ప్రాంతాల నుంచి మూడు ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ వైద్య బృందాలు భద్రాచలం చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ బృందాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు తదితర వైద్య నిపుణులు ఉన్నారని చెప్పారు.
గొల్లగుప్ప గ్రామంలోని సుమారు 270 మంది ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించి సికిల్ సెల్ ఎనీమియా తదితర ఇతర ఆరోగ్య సమస్యలు, కొమార్బిడిటీలను గుర్తించేందుకు వైద్య బృందాలు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు.
ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, బాధితులకు, గ్రామ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతూరు పీవో, సబ్ కలెక్టర్ శుభం నొక్వల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. సరిత, ప్రత్యేక వైద్య బృందాల సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)