ప్రజాశక్తి-బాపట్ల : విద్యుత్ షాక్‌కు గురై తల్లీ, కుమారుడు మృతి చెందిన ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాయుగుండం ప్రభావంతో విద్యుత్ లైన్ తెగి నేలవైపు వేలాడుతున్న విషయాన్ని గమనించకుండా తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వివరించారు.
నర్సీపట్నం నాతవరంలో విద్యుదాఘాతంతో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనపైనా మంత్రి ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన నాగరాజుకు మెరుగైన వైద్యసదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో రెండు ప్రమాద ఘటనలకు గల కారణాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వాయుగుండం ప్రభావంతో విద్యుత్ స్తంభాలు పడిపోయినా, వైర్లు తెగినా వెంటనే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్రమాదాలను గుర్తించిన వెంటనే సమీప విద్యుత్ శాఖ కార్యాలయానికి సమాచారం అందించేలా సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రమాదాలను నివారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)