మొక్కజొన్న పంట ధ్వంసం
ప్రజాశక్తి–మక్కువ(మన్యం) : మక్కువ ఫారెస్ట్ సెక్షన్ పరిధిలోని జంతికొండలో గత కొన్ని రోజులుగా తిష్ట వేసిన ఏనుగుల గుంపు శనివారం పార్వతీపురం మండలం పరిసరాల్లోని జమ్మడవలస పొలాల్లో సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మండల పరిధిలోని కొత్తలోవరకండి ప్రాంతంలో గిరిజనులు సాగు చేస్తున్న పోడు వ్యవసాయ పంటలను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు నాశనం చేయడంతో గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంకీ ఏనుగులు ఉన్నప్పటికీ అడవి ఏనుగులను నియంత్రించలేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం వెంటనే ఆదుకుని తగిన పరిహారం అందించాలని గమ్యాల అప్పలస్వామి, కొర్ర పండన్ కుటుంబీకులు కోరారు.







కామెంట్‌లు (0)