ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిధర్‌ హత్య కేసులో ఇద్దరి అరెస్టు

29 నిమిషాల క్రితం

pressmeet.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కత్తి, సెల్‌ఫోన్లు స్వాధీనం

  • వివరాలు వెల్లడించిన అదనపు ఎస్పీ కిషోర్‌కుమార్‌

ప్రజాశక్తి-కాకినాడ:కాకినాడ సాంబమూర్తి నగర్‌లో ఈనెల 2న జరిగిన గిరిధర్‌ హత్య కేసును త్రీటౌన్‌ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇందిరానగర్‌కు చెందిన పాలేపు వివేక్‌ అలియాస్‌ బన్నీ, అయోధ్యనగర్‌కు చెందిన ఏలూరి రామకృష్ణను ఈ నెల 12న అరెస్టు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ, ఇన్‌చార్జి డీఎస్పీ డాక్టర్‌ మహంతి కిషోర్‌కుమార్‌ ఆదివారం వెల్లడించారు. గిరిధర్‌ తన సెల్‌ఫోన్‌లో కొంతమంది మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు భద్రపరిచినట్లు, అతడితో సన్నిహితంగా ఉండే బన్నీ, రామకృష్ణలకు ఈ విషయం తెలిసినట్లు వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు వాటిని గిరిధర్‌ నుంచి తీసుకుని, సంబంధిత మహిళల కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు సంపాదించాలని పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ నెల 1న రాత్రి గిరిధర్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 12.15 గంటలకు నిందితులు అక్కడికి వెళ్లి ఫొటోలు, వీడియోల విషయమై అతడితో గొడవపడ్డారు. ముందుగా తీసుకెళ్లిన కత్తితో గిరిధర్‌ కంఠం, భుజంపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ప్రత్యక్ష, పరోక్ష, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక పెన్ డ్రైవ్‌, మృతుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఇన్‌స్పెక్టర్‌ కె.వి.ఎస్‌. సత్యనారాయణ, ఎస్‌ఐలు జి.వి.వి.ఎస్‌. చౌదరి, వి. ఆంజనేయరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ సతీష్‌, కానిస్టేబుళ్లు మురళిరాజు, బి. శ్రీనివాసరావు, ప్రేమ్‌కుమార్‌, క్రైమ్‌ సిబ్బందిని ఎస్పీ జి. బిందుమాధవ్‌ అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్