న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు మరింత దృఢంగా, సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ ఆదివారం స్పష్టం చేశారు. ప్రస్తుతం పరస్పరం అనుసంధానమైన ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు రెండో రోజు ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం’ అనే అంశంపై జరిగిన బహిరంగ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతున్నాయని, ఇది సామాన్య ప్రజల జీవితాలపై గణనీయమైన, విస్తృతమైన ప్రభావాన్ని చూపుతోందని ఆయన అన్నారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా గొలుసుల అంతరాయాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాల్లో క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తిరిగి బలంగా నిలబడే సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం, తక్షణ చర్యలు చేపట్టడం కూడా ముఖ్యమని అన్నారు. అంటువ్యాధుల నివారణ, వాటిపై స్పందించేందుకు ఉద్దేశించిన ‘బ్రిక్స్ సమగ్ర ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’పై ఏకాభిప్రాయం కుదిరిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ కోసం ‘ముందస్తు హెచ్చరిక డేటా అనుసంధాన మార్గదర్శకాలు’ రూపొందించినట్లు తెలిపారు. సదస్సులో భాగంగా భారత్ మండపంలో ప్రధాని మోడీ, బ్రిక్స్ దేశాల నేతలు గ్రూప్ ఫోటో దిగారు. ప్రధాని మోడీకి ఇరువైపులా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిల్చున్నారు.
గ్లోబల్ సౌత్ దేశాలు సమిష్టిగా ఎదగాలి: జిన్‌పింగ్
ప్రపంచం ఎన్నడూ చూడని లోతైన మార్పులకు లోనవుతోందని, ఈ నేపథ్యంలో గ్లోబల్ సౌత్ దేశాలు సమిష్టిగా ఎదుగుతూ బహుధ్రువత్వానికి కీలక చోదక శక్తిగా మారుతున్నాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ఆయన.. అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా, అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు గ్లోబల్ సౌత్ దేశాలతో కలిసి అంతర్జాతీయ వ్యవహారాల్లో సానుకూల, స్థిరీకరణ పాత్ర పోషించాలని సూచించారు. సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, వివాదాల శాంతియుత పరిష్కారం వంటి అంతర్జాతీయ నిబంధనలను పరిరక్షించాలని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలు ఆచరణాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, పారిశ్రామిక, సరఫరా గొలుసుల స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఆవిష్కరణలు, సాంప్రదాయ–వర్ధమాన పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. బ్రిక్స్ సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఐదు కార్యక్రమాలను కూడా ప్రతిపాదించారు.







కామెంట్‌లు (0)