ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడ్డతీగల గిరిజన బాలిక ఘటనపై ముగ్గురు సిబ్బంది సస్పెన్షన్

18 నిమిషాల క్రితం

dmdo.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 12:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అడ్డతీగల: అడ్డతీగల జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల (బాలికల)లో 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చిన ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ప్రాథమిక చర్యల్లో భాగంగా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం. రుక్మందయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

బాలికకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు కాకినాడలోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు. సెప్టెంబర్‌ 10న నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలిక గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయిందని కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ఔట్‌సోర్సింగ్‌ కుక్‌గా పనిచేస్తున్న కె. మంగరాజు తనపై మూడుసార్లు అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో, ఇతర వర్తించే చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. ఈ ఘటనపై ఐసీడీఎస్‌ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు.

విద్యార్థుల భద్రత, రక్షణ, ఆరోగ్యం, సంక్షేమం పట్ల ఆశ్రమ పాఠశాల యాజమాన్యానికి ఉన్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలవరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎస్‌. ప్రశాంత్‌కుమార్‌ ఆదేశాల మేరకు విచారణను ప్రభావితం కాకుండా అడ్డతీగల జీటీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల (బాలికల) ప్రధానోపాధ్యాయురాలు డి. శాంతిమతి, హెచ్‌ఎం గ్రేడ్‌-II, హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారి పి. విజయకాంతం, హెచ్‌డబ్ల్యూఓ గ్రేడ్‌-II, అలాగే 9వ తరగతి ‘ఎ’ సెక్షన్‌కు చెందిన ఎస్‌ఏ (బీఎస్‌) కె. లోవమ్మను సస్పెండ్‌ చేస్తూ జిల్లా గిరిజన సంక్షేమ సాధికారిత అధికారి, డిప్యూటీ డైరెక్టర్‌ ఎం. రుక్మందయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో వెలువడే అంశాల ఆధారంగా వర్తించే సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ వ్యవస్థలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్