నివాళులర్పించిన మంత్రులు
ప్రజాశక్తి - ఏలూరు సిటీ : మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అంత్యక్రియలు గురువారం ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఏలూరు శ్రీరామ్‌నగర్‌లోని ఆయన నివాసం వద్ద ఉన్న సొంత స్థలంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది అభిమానులు, పార్టీ నాయకులు, ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చారు.
ఆళ్ల నాని అకాల మృతి పట్ల రాష్ట్ర విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులోని నాని నివాసానికి చేరుకున్న లోకేష్.. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. టిడిపి తరఫున, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఆళ్ల నాని మృతి అత్యంత బాధాకరమన్నారు. ఆయన డిప్యూటీ సిఎంగా ఉన్న సమయంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విమర్శలకు దూరంగా, హుందాతనంతో వ్యవహరించేవారని తెలిపారు. కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని గుర్తుచేశారు.
నాని భౌతికకాయాన్ని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఎంపి పుట్టా మహేష్‌కుమార్, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ ఎంజె అభిషేక్‌గౌడ, ఎస్పి కె ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, మద్దిపాటి వెంకట్రాజు, సొంగా రోషన్‌కుమార్, పత్సమట్ల ధర్మరాజు, ఎమ్మెల్సీలు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.







కామెంట్లు (0)