- వైసిపి అధినేత జగన్
- సెప్టెంబరు లేదా అక్టోబరులో చేపడతానని వెల్లడి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు వైసిపి అధినేత జగన్ తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన పర్చూరు నియోజకవర్గ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చూస్తుండగానే రెండున్నర ఏళ్లు గడిచాయని, వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టి అన్ని ప్రాంతాల్లోనూ తిరుగుతానని అన్నారు. వైసిపి పాలనలో మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మ్యానిఫెస్టోకు ఒక అర్ధం తీసుకొచ్చామని అన్నారు. ఏటా బడ్జెట్ సమయంలోనే క్యాలెండర్ ప్రకటించి పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని, కూటమి పాలనలో అటువంటి ప్రస్తావనే లేదని వివరించారు. ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి పాలన ఇంటి గడప వద్దే అందించినట్లు వివరించారు. ప్రభుత్వ స్కూళ్లు పూర్తిగా మార్చేసి, ప్రైవేటుకు థీటుగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు పథకంలో వైద్యం అందించామని, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్, నాడు–నేడు పనులతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని చెప్పారు. రైతుభరోసా కేంద్రాలు, ఈ క్రాప్, పంటల గిట్టుబాటు ధర వచ్చేలా చేశామని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను రద్దు చేశారని తెలిపారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు వచ్చాయని, అవి జరుగుతాయో లేదో తెలియదని తెలిపారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్)లో 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఇలాంటప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా అనుమానమని పేర్కొన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా, ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని తెలిపారు. ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు, అరెస్టులు, జైలుకు పంపడం వంటి చర్యలకు దిగుతున్నారని పేర్కొన్నారు.
అయితే ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా, ప్రజలకు వైయస్సార్‌సిపి తోడుగా నిలబడుతుందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని, కసిగా అందరూ నిలబడి పోరాడాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు అబద్ధాలు, దౌర్జన్యాలను హర్షించబోరని అన్నారు.







కామెంట్‌లు (0)