mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇద్దరూ అంగీకరిస్తే విడాకులకు ‘ఆరు నెలలు’ అక్కర్లేదు : హైకోర్టు తీర్పు

45 నిమిషాల క్రితం

andhra-pradesh-high-court.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 11:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- అమరావతి : పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్న భార్యాభర్తలు తమ మధ్య ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకుని, తిరిగి కలిసి జీవించే అవకాశం లేదని కోర్టు సంతృప్తి చెందినప్పుడు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 13(బి)(2) ప్రకారం నిర్దేశించిన ఆరు నెలల కూలింగ్‌ పీరియడ్‌ను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కూలింగ్‌ పీరియడ్‌ ఉద్దేశం దంపతులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని కలిసి జీవించే అవకాశాన్ని కల్పించడమేనని, అలాంటి అవకాశం లేని సందర్భాల్లో దానిని మినహాయించవచ్చని పేర్కొంది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, ఆరు నెలల కూలింగ్‌ పీరియడ్‌ విధిస్తూ విచారణను వాయిదా వేసింది. అనంతరం అన్ని వివాదాలపై రాజీ కుదిరినందున విచారణను ముందుకు జరపాలని కోరినా ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, కూలింగ్‌ పీరియడ్‌ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కేసులో రాజీ స్వచ్ఛందంగా కుదిరిందని, కలిసి జీవించే అవకాశం లేదని తేలిన నేపథ్యంలో ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేశారు. కూలింగ్‌ పీరియడ్‌ పూర్తికాకముందే విడాకుల పిటిషన్‌ను విచారించి, సాధ్యమైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని ఒంగోలు ఫ్యామిలీ కోర్టును ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్