- జగన్‌పై మంత్రి మండిపల్లి ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే నైతిక హక్కు మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేదని మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ నిర్వాసితులను గాలికొదిలేసి క్రెడిట్ చోరీ అంటారా అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం అంటే కేవలం కాల్వలు తవ్వడం, చెరువులు కట్టడం మాత్రమే కాదని, భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, పరిహారం చెల్లించడం, ఇళ్లు కట్టించి ఉపాధి చూపించడం ప్రభుత్వాల బాధ్యత. జగన్ తన పాలనలో నిర్వాసితులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస బాధ్యతలే నెరవేర్చకుండా ఇప్పుడు "క్రెడిట్ చోరీ" అనడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ఖర్చు, చేసిన పనులపై ఆధారాలతో సహా బహిరంగ చర్చకు తాము సిద్ధమని, వైసిపి నాయకులకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు సుమారు రూ.8వేల కోట్ల కాగా అందులో రూ.3,600కోట్లు కేవలం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వెలుగొండ ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి పనులు వేగవంతం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి మిగిలిన పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుందని తెలిపారు. కేవలం ₹840 కోట్లు ఖర్చు చేసి తానే ప్రాజెక్టును పూర్తి చేశానని జగన్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.








కామెంట్‌లు (0)