శ్మశాన స్థలం కోసం కూడా పోరాడాలి : మాజీ ఎమ్మెల్సీ గేయానంద్
ప్రజాశక్తి - యంత్రాంగం : బతికున్నప్పుడు ఇళ్ల స్థలం కోసం పోరాటం.. బతకడానికి తాగునీటి కోసం.. నడవడానికి రోడ్డు కోసం.. అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం.. చివరికి చనిపోయిన తర్వాత అరడుగుల శ్మశాన స్థలం కోసం కూడా దళితులు పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సామాజిక శంఖారావం పేరుతో గత నెల నిర్వహించిన సర్వేలో దళిత, గిరిజన వాడల్లో వెలుగులోకి వచ్చిన ప్రజా సమస్యలపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్), వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఈ యాత్రలు కొనసాగాయి. దళితులకు శ్మశానవాటికల కోసం స్థలాలు కేటాయించాలని, దళితులు, గిరిజనులకు భూమి, ఇళ్ల స్థలాలు అందించాలని బృందం నాయకులు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, ఏడాదికి 200 రోజులకు తగ్గకుండా ఉపాధి పనులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 24న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద గేయానంద్, ప్రజా పర్యవేక్షణ కమిటీ నాయకులు సత్య బోస్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్రలో కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఒ నల్లప్ప, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కెవిపిఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. బుక్కరాయసముద్రం, నార్పల, యల్లనూరు, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాల్లో కొనసాగింది. బుక్కరాయసముద్రం మీదుగా జంతలూరు, కేసేపల్లి, నార్పల మండలం తుంపెర, యల్లనూరు మండలం కూచువారిపల్లి, కొడవాండ్లపల్లి, గొడ్డుమర్రి, ఓబులాపురం, కడవకల్లు, పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె, జూటూరు, కోమలిలో ఈ యాత్ర కొనసాగింది. తాడిపత్రి మండలం పెద్దపడమలలో యాత్ర బృందం రాత్రి బస చేసింది.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు, పటవల పంచాయతీల్లోని దళిత పేటల్లో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తూర్పు పేటలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని 11 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే దళితులను అరెస్టు చేసి జైలుకు పంపారని, సమస్యను మాత్రం నేటికీ పరిష్కరించలేదన్నారు. కోరంగి కంపెనీ భూములను వెంటనే పేదలకు పంచకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. పటవలలో ఆక్రమణకు గురైన దళితుల శ్మశాన భూమిని వెంటనే దళితులకు అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దళితుల సమస్యలపై 24న కలెక్టరేట్ల వద్ధ ధర్నాలు నిర్వహిస్తున్నామని, వీటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస్, కెవిపిఎస్ నాయకులు వి.శ్రీను తదితరులున్నారు.
కర్నూలు నగరంలోని వడ్డెగేరి బాపూజీ నగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. ఈ నెల 24 కర్నూలు కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లి దళితవాడ 21 వార్డులో కెవిపిఎస్, సిఐటియు, డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో పాదయాత్ర జరిగింది. దళితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం నాగలపుట్ట, రాళ్లమిట్ట ప్రాంతంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి స్థలాలు, వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, డ్రయినేజీ కాలువలు, మంచినీటి సమస్యలను ప్రజలు సర్వే బృందం దృష్టికి ఆయా ప్రాంతవాసులు తీసుకువచ్చారు.
విశాఖ నగరంలోని జివిఎంసి 1వ వార్డు పరిధి విల్సన్‌పేట దళిత కాలనీలో కెవిపిఎస్, సిఐటియు, ఇతర ప్రజాసంఘాల భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రజలనడిగి తెలుసుకున్నారు.








కామెంట్‌లు (0)