కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధితులను ఆదుకోవాలంటూ ఆందోళన
ప్రజాశక్తి-దుగ్గిరాల: దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దుగ్గిరాల బంద్ బంద్ పిలుపుతో మండల కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఉదయం నుంచే పసుపు రైతులు, రైతు సంఘం నాయకులు పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. రైతులకు న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ వ్యాపారుల మద్దతు కూడగట్టారు. బంద్ ప్రభావంతో దుగ్గిరాల పట్టణంలో వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.
రైతుల బందుకు సహకరించాల్సిందిగా కోరుతూ నిరసనకారులు స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వద్దకు చేరుకున్నారు. బ్యాంకు లావాదేవీలను నిలిపివేసి కార్యాలయాన్ని మూసివేయాలంటూ పసుపు రైతుల సంఘం నాయకులు, రైతులు ఒక్కసారిగా బ్యాంకు లోపలికి దూసుకెళ్లారు. కార్యాలయం ప్రాంగణంలోనే బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ప్రమాదం జరిగి ఇంతకాలమవుతున్నా హామీలు అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాంకు మూసివేత, ఆందోళనల నేపథ్యంలో దుగ్గిరాలలో తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను, నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. శాంతిభద్రతల సమస్య వస్తుందని, ఆందోళన విరమించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో.. పోలీసులకు, రైతు సంఘం నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం ఏంటని నాయకులు పోలీసులను నిలదీశారు. ఇరువర్గాల మధ్య నెట్టులాట జరగడంతో కాసేపు అక్కడ ఉత్కంఠ నెలకొంది.











కామెంట్‌లు (0)