రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన ముందస్తుగా సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పింఛన్లు సంక్షేమ ప్రయోజనమని ఆయన పేర్కొన్నారు. వీటిని రాజకీయ ప్రచారానికి లేదా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. గత కొంతకాలంగా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పింఛన్ల పంపిణీ చేయిస్తూ, ఆయా పార్టీలు పింఛన్లు అందిస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలకు, రాజకీయ జోక్యానికి అవకాశం లేకుండా చూడాలని కోరారు.
సంబంధిత ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రమే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా పింఛన్లు అందేలా పర్యవేక్షించాలని, పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.







కామెంట్‌లు (0)