ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కృంగిపోతున్న జనం, మొద్దు నిద్రలో పాలకులు

1 గంట క్రితం

chbaburao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 04:36 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

డబుల్ ఇంజన్ సర్కార్ లో ధరలు, పన్నులు డబుల్ మోత
నిత్యం పెరుగుతున్న ధరలు.. పెరగని ఆదాయాలు
ధరల పెరుగుదలపై విజయవాడలో సిపిఎం నిరసన, ఇంటింటి ప్రచారం
ఆందోళనలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు
అమరావతి : నిత్యావసరాల ధరల పెరుగుదలతో జన కృంగిపోతుంటే.. పాలకులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆదివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ 58వ డివిజన్ లో ఆందోళన చేపట్టారు. సిహెచ్‌.బాబురావుతో పాటు పలువురు సిపిఎం కార్యకర్తలు స్థానిక ప్రజలతో కలిసి నిత్యవసర వస్తువులను ప్రదర్శిస్తూ, బ్యానర్లతో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలను అరికట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వాల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ డిపోలో నిత్యవసర వస్తువులను చౌక ధరలకు అందించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బాబురావు, సిపిఎం నేత బి. రమణారావు మాట్లాడారు. రెండు మూడు నెలల్లోనే బియ్యం ధరలు కేజీకి 15 నుండి 20 రూపాయలు పెరగటం ఏనాడూ లేదని అన్నారు. పప్పులు ,నూనెలు, పంచదార, బెల్లం, ఉల్లిపాయలు తో సహా అన్ని రకాల నిత్యవసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి తోడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్, వంటగ్యాసు, విద్యుత్ ఛార్జీలను, ఇంటి పన్నులను పెంచి అగ్నికి ఆజ్యం పోస్తోందని మండిపడ్డారు. సామాన్యులు మొదలు మధ్యతరగతి ప్రజల వరకు ధరల భారంతో విల విల లాడుతున్నా... కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ, కూటమి ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు లేదని దుయ్యబట్టారు. ఒకవైపున రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, మరోవైపు మార్కెట్లో అన్ని ధరలు మండిపోతున్నాయని, అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహించడం దుర్మార్గమని అన్నారు. కార్పొరేట్లు, బ్లాక్ మార్కెట్ దారులు.. ధరలు పెంచి సామాన్యులను కొల్లబడుతున్నా, ప్రభుత్వాలు వారికే కొమ్ము కాయటం సిగ్గుచేటని అన్నారు. సామాన్యులను గాలికి వదిలేయటం బాధాకరమని అన్నారు. రిటైల్ వర్తకంలోకి, పంటల కొనుగోళ్ల మార్కెట్లోకి బడా కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించి, మార్కెట్ను శాసిస్తున్నాయని అన్నారు.

ప్రభుత్వాలు.. ప్రజా పంపిణీ వ్యవస్థను, చౌక డిపోలను నీరుగారుస్తున్నాయని, దెబ్బతీస్తున్నాయని అన్నారు. చౌక డిపోలలో నాసిరకం బియ్యం, అరకేజీ పంచదార తప్ప ఏ రకమైన సరుకులు ఇవ్వడం లేదని అన్నారు. చౌక డిపోలలో 16 రకాల నిత్య అవసరాలను ఇవ్వకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న పాలకులు, 24 గంటలూ మద్యం మాత్రం సరఫరా చేస్తున్నారని అన్నారు. మరోవైపు నిరుపేదలు, వితంతువులు, వికలాంగులకు 35 కేజీల బియ్యం ఇచ్చే అంత్యోదయ స్కీమును దెబ్బతీసి మనిషికి 7 కేజీలకు కుదించడం, కోత పెట్టడం అమానుషమని అన్నారు. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు, నేడు ఆ ఊసే ఎత్తకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరవాలని, అన్ని రకాల నిత్యవసర వస్తువులను రేషన్ డిపోల ద్వారా చౌక ధరలకు అందించాలని అన్నారు. పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు నిత్యవసరాలను ఇవ్వాలని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినందున, పెట్రోలు, డీజీలు, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత పధకం ద్వారా అత్యధిక మందికి సబ్సిడీ జమ కావడం లేదని, , ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా అందరికీ మూడు సిలిండర్లకు సబ్సిడీ జమ చేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు కోసం ఆరాటపడుతున్న పాలకులు, నేతలు... నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ప్రజలంతా ఐక్యమై ప్రజాప్రతినిధులను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో సిపిఎం నేతలు నిజాముద్దీన్ సహా పలువురు ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్