ఏటిగట్టుపైనే అంత్యక్రియలు
‘సామాజిక శంఖారావం’లో *కన్నీటి పర్యంతమైన బాధితులు
ప్రజాశక్తి - యంత్రాంగం : స్మశాన వాటికను పెత్తందారులు ఆక్రమించుకుని తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఏవరై నా చనిపోతే ఏటిగట్టు పక్కన ఖననం చేసుకోవాల్సి వస్తోందని దళితులు తమ సమస్యను ప్రజాసంఘాల నాయకుల ఎదుట చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. డ్రైయినేజీ లేకపోవడంతో ఇంటి ముందు మురుగు నీరు నిలిచిపోయి నరకప్రాయంగా మారుతోందని, అధికారులకు విన్నవించుకున్నా సమస్యల పరిష్కారం కావడం లేదని, తమను పట్టించుకునే నాధుడే లేరని వాపోయారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం,ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన సామాజిక శంఖారావంలో నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పడు ఈ దారుణమైన సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
పశ్చిమగోదావరి జిల్లా చించినాడ గ్రామం అరుంధతీపేటలో సామాజిక శంఖారావం నిర్వహించారు. పూర్వం నుంచి తాము వినియోగించుకుంటున్న స్మశాన వాటికకు పెత్తందారులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని నాయకుల ఎదుట దళితులు వాపోయారు. నాటి నుండి ఎవరైనా చనిపోతే ఏటిగట్టు పక్కనే ఖననం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడుతూ.. ఆక్రమణలో ఉన్న దళితుల స్మశాన వాటికను దళితులకు అప్పగించాలని, దీనిపై అధికారుల నిర్లక్ష్యం తగదన్నారు. స్కిన్నెరపురం అరుంధతీ పేటలో సర్వే నిర్వహించారు.
కాలువ గట్టు మధ్యనే దహన సంస్కారాలు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాల్టీ పరిధిలోని పిఎన్ బొడ్డవలస, బంగారమ్మపేటలో స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని అధికారుల చుట్టూ ఏన్నో ఏళ్లుగా తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు రోడ్డు, కాలువ గట్టు మధ్యనే దహన సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోందని ప్రజాసంఘాల నాయకుల ఎదుట స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. కొమరాడ మండలంలోని చోళ్లపదం, రామభద్రపురం, వీరఘట్టం, దశమంతపురం గ్రామాల్లో క్షేత్రస్థాయి అధ్యయన యాత్రలు నిర్వహించారు.








కామెంట్‌లు (0)