ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగిరి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

1 గంట క్రితం

school
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 02:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మారికవలస గురుకులంపై ప్రభుత్వ వైఖరి పట్ల విమర్శలు

  • పాఠశాలను కొనసాగిస్తామని తీసుకొచ్చిన విద్యార్థులకు సౌకర్యాలు మృగ్యం

  • తాజా నిర్ణయాలతో బాలికలకూ ఇబ్బందులు!

ప్రజాశక్తి- మధురవాడ (విశాఖపట్నం) : విశాఖ నగరం పరిధిలోని మారికవలస గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మళ్లీ వెళ్లగొట్టే చర్యలకు పాల్పడుతోంది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌‌లెన్స్‌‌ ఏర్పాటు పేరుతో మారికవలస బాలుర గురుకులంలోని 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విద్యార్థులను ఇళ్లకు పంపివేసిన విషయం విదితమే. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యాన అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఎ ముందు శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం, దీంతో, అధికారులు స్పందించి గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇవ్వడం, 37 మంది విద్యార్థులనూ గురుకులానికి తిరిగి తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే, వారికి పాఠశాలలో రెండు గదులే కేటాయించారు. కనీస వసతులు కల్పించలేదు. దీంతో, వారంతా శని, ఆదివారాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఈ విషయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు, గురుకులాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కె.రవిబాబుకు విద్యార్థులు ఆదివారం తెలియజేశారు. ‘శనివారం మమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చారు. ఎవరూ సరిగా పట్టించుకోలేదు. మాకు ఎటువంటి వసతులూ లేవు. మరుగుదొడ్లనూ వినియోగించనీయడం లేదు. గతంలో మాకు ఉన్న వస్తువులను వేరొక చోటుకు తరలించేశారు. మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా పెట్టలేదు. కాలేజీ విద్యార్థులు భోజనం చేసిన తర్వాతే మాత్రమే మమ్మల్ని తినాలని చెప్పారు. దోమలతో ఇబ్బంది పడుతున్నాం’ అని వాపోయారు. ముఖ్యమంత్రి కార్యక్రమం అరుకులో ఉన్నందున వ్యతిరేకత రాకుండా తమను హడావుడిగా ఇక్కడకు తీసుకొచ్చి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రవిబాబు మాట్లాడుతూ గురుకులాన్ని కొనసాగిస్తామన్న మాట తప్పితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ​

గురుకులాన్ని కొనసాగించాలని ఆందోళన

మునుపటిలాగే గిరిజన గురుకులాన్ని బాలురు, బాలికలకు వేర్వేరుగా మారికవలసలోనే కొనసాగించాలని కోరుతూ పాఠశాల గేటు వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆందోళనకు దిగారు. అధికారులు హామీ ఇచ్చి ఒక్క రోజు కూడా గడవకముందే మళ్లీ కొత్త వివాదానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలురు, బాలికలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ఒకేచోట విద్యాబోధనకు సిద్ధమవుతున్నారని, రెండు క్యాంపస్‌‌లను వేర్వేరుగా కొనసాగిస్తేనే బాలికలకుగానీ, బాలురకుగానీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌‌లెన్స్‌‌కు తాము వ్యతిరేకం కాదని, ప్రత్యామ్నాయ ప్రదేశం చూసి దాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

ఆర్‌‌డిఒ నిలదీత, వాహనం అడ్డగింత

అదే సమయంలో ఆర్‌‌డిఒ దిలీప్‌ ‌చక్రవర్తి అక్కడకు రాగా, గురుకుల పాఠశాల నిర్వహణపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన వాహనానికి అడ్డుగా నిల్చున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. దౌర్జన్యంగా పక్కకు నెట్టేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.అజయ్‌, నాయకులు కె.తరుణ్‌, ఎస్‌.తులసి, జి.సంజయ్‌, ఎం.నరేష్‌, పి.ప్రగతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

​గిరిజన విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసేందుకే ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు

ఎపి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి గౌతమి

రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో వారు ఉత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మారికవలసలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.గౌతమి తెలిపారు. మారికవలస బాలుర గురుకుల పాఠశాల క్యాంపస్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఆమె సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గిరిజన గురుకులాల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు జాతీయ స్థాయి అర్హత పరీక్షలైన ఐఐటి-జెఇఇ, నీట్ వంటి పోటీ పరీక్షలకు అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్ఎఫ్‌‌పి ప్రక్రియ ద్వారా దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ అయిన ‘ఫిజిక్స్ వాలా’ను ఎంపిక చేసిందని తెలిపారు. ఈ సంస్థ నిపుణులైన అధ్యాపకులతో పిల్లలకు ఇంటెన్సివ్ కోచింగ్ అందిస్తుందని, దీనికి సంబంధించిన తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో ఇదివరకు ఉన్న విద్యార్థులను పక్కనే ఉన్న గర్ల్స్ క్యాంపస్‌‌కు, కృష్ణాపురం, సబ్బవరం ఎస్ఒఇలకు, కొందరి అభ్యర్థన మేరకు సొంత ప్రాంతాల గురుకులాలకు తరలించామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్