ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గణిత చమత్కారం

1 గంట క్రితం

katha.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 03:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక రాజ్యంలో యువరాజు ఒకసారి సభలో ఒక ప్రకటన చేశారు. తను చెప్పబోయే విషయంలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెబితే వెయ్యి నూట పదహారు బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని చెప్పారు. ‘ఇటీవల నా జన్మదినం సందర్భంగా, మహారాణికి ఇష్టమైన గుత్తివంకాయ కూర వండమని వంటవారికి చెప్పాను. అప్పుడు రంగంలోకి దిగిన వంటవాడు మహారాణి గారికి ఎంతో ప్రీతియైన ఆ కూరలో ఉప్పు, కారం బాగా వెయ్యడంతో పాటు, సన్నే మీద మసాలా నూరుతున్నాడు. అప్పుడు పక్కనే ఉన్న వంటవాడి కూతురు ఘుమఘుమ మసాలా వాసనకు భయపడి ఏడ్చింది. పొయ్యి దగ్గర చెంబుతో నీళ్లు తాగుతూ వంటవాడి కొడుకు ఆడుతున్నాడు. ఆ నీళ్లు పొయ్యిలో పడి మంటలు ఆరుతున్నాయి. దీనిని గమనించిన వంటవాడి భార్య, కొడుకుతో నీకు పొయ్యి దగ్గర ఏమి పనిరా, కాళ్లు జారి పొయ్యిలో పడ్డావంటే నీకు దెబ్బలు మూడుతాయని చెప్పింది. అయినా వాడు వినకపోయేసరికి పిల్లాడిని పట్టుకొని దూరంగా లాగింది. ఈలోపు గుత్తివంకాయ కూర తయారైంది. దానిని తిన్న మహారాణి, ఆ రుచికి చాలా ఆనందంతో, సంతోషం పట్టలేక వంటవాడిని పిలిచి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చారు’ అని విషయం చెప్పి ‘ఇందులో ఉన్న సారాంశాన్ని బట్టి వంటవాడికి రాణి ఎన్ని బంగారు కాసులు ఇచ్చిందో చెప్పండి’ అని ముగించారు.

సమాధానం:

కథలో వచ్చిన గణిత సంఖ్యలను పరిశీలిస్తే వెయ్యి నూట పదహారు బంగారు కాసులు అని తెలుస్తుంది.

వివరణ:

1. ఉప్పు, కారం బాగా ‘వెయ్యి’ డంలో ఉన్న సంఖ్య 1000

2. సన్నే మీద మసాలా ‘నూరు’ తున్న లో ఉన్న సంఖ్య 100

3. మసాలా వాసనకు ‘ఏడు’ స్తోంది లో ఉన్న అంకె 7

4. మంటలు ‘ఆరు’తున్నాయి లో ఉన్న అంకె 6

5. నీకు దెబ్బలు ‘మూడు’ తాయనిలో ఉన్న అంకె 3

మొత్తం = 1000 + 100 + 7 + 6 + 3 = 1116

మడ్డు తిరుపతిరావు,

గణిత అవధాని & టీచరు,

బూరగాం, కంచిలి, శ్రీకాకుళం,

94913 26473.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్