మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition2027 మార్చి నాటికి పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి

3 గంటల క్రితం

Nimmala Ramanaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 10:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ముంపు ఏరియాల్లో లోపాలు గుర్తించాం

  • జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలవరం పునరావాసం, పునర్నిర్మాణం పనులు మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అలాగే ముంపు ఏరియాల్లోని కొన్ని మండలాల్లో కాంటూరు లెక్కల్లో పొరపాట్లు గుర్తించామని తెలిపారు. జలవనరులశాఖలో రెండేళ్ల పురోగతిపై మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలవరం, వెలిగొండ, హంద్రీనీవాతోపాటు, ఎల్‌ఐ స్కీములు, జలధార జలహారతి, డ్యాం భద్రతలు, ఇతర ప్రాజెక్టుల్లో చేపట్టిన అంశాలపై ఆయన మాట్లాడారు. పోలవరం విషయంలో గత వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కాపర్‌‌డ్యాములు కొట్టుకుపోయాయని, డయాఫ్రం వాల్‌ ‌దెబ్బతిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చేసిన పొరపాటు వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని వివరించారు. ఆర్‌అండ్ఆర్‌ ‌నిధులనూ దారి మళ్లించారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కుడి, ఎడమ కాలువల పనులు వేగం పుంజుకున్నాయని, రైట్‌ ‌కెనాల్‌ ఈ నెలలో పూర్తి చేస్తామని, ఎడమ కాలువ నవంబరు ‌నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే 41.15 మీటర్ల ఎత్తులోపు 16,438 ఎకరాల్లో 10,491 ఎకరాలు సేకరించారని, మిగిలింది ఈ ఏడాది అక్టోబరు ‌నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 2024 జూన్‌ ‌నుంచి నిర్వాసితులకు రూ.2,250 కోట్లు పూర్తి చేస్తామని చెప్పారు. కేంద్రం ఫేజ్-1కు 30,436 కోట్లకు అనుమతినిచ్చిందని వివరించారు. ఈ రెండేళ్లలో రూ.6,912 కోట్లు వినియోగించామని చెప్పారు. ఈ నెలలోపే అనకాపల్లికి పోలవరం నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టుకు 2024 నుంచి ఇప్పటి వరకూ రూ.1,108 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రూ.3,870 కోట్లతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెండు దశల పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. 530 చెరువులు నింపి రాయలసీమలో సాగునీటికి భరోసా ఇచ్చామని చెప్పారు. రూ.3 వేలకోట్లతో మడకశిర బ్రాంచ్‌ ‌కెనాల్‌ ‌విస్తరిస్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 11 ప్రాజెక్టులను రూ.3 వేలకోట్లతో ఈ ఏడాది డిసెంబరు ‌నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 2027 ఏప్రిల్‌ ‌నుంచి డిసెంబరు 2028లోపు వంశధార, హిరమండలం, నాగావళి-చంపావతి, మడ్డువలస, మహేంద్రతనయ, గజపతినగరం, ఎస్‌‌జిఎల్‌ ‌తోటపల్లి, జంఝావతి, తారకరామ, వంశధార నేరడి బ్యారేజీ పనులు పూర్తి చేస్తామని వివరించారు. 789 ఎత్తిపోతల పథకాలను పదేళ్లపాటు నిర్వహించేందుకు రూ.3,883 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తికి ఇరిగేషన్‌ ‌కేలండర్‌ ‌ప్రకటించామని చెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12 వేలకోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.

పోలవరం కాంటూరు గుర్తింపులో లోపాలు నిజమే

పోలవరం పునరావాసం విషయంలో కాంటూరు గుర్తింపులో లోపాలు ఉన్నట్లు ఇటీవల గుర్తించామని మంత్రి తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. మొదటిదశలో 41.15 కాంటూరు పరిధిలో నీటిని నిలబెడతామని తెలిపారు. 2015లో లైడార్‌ ‌సర్వేలో 21 వేల కుటుంబాలను గుర్తించామని, తరువాత 15 వేల కుటుంబాలను తరలించాలని గుర్తించినట్లు తెలిపారు. తొలిదశకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని, రెండోదశకు కూడా సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబరు నాటికి మొదటిదశ పునరావాసం పూర్తి చేయాలని టార్గెట్‌ ‌పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ పునరావాసం 45.40 శాతం పూర్తి చేశామన్నారు. కాంటూరు గుర్తింపులో లోపాలున్నట్లు నిజమేనని తెలిపారు. గ్రామం 45.72 మీటర్ల ఎత్తులో ఉంటే దానికి వెళ్లే రోడ్డు 41.15 మీటర్ల కాంటూరులో ఉందని తెలిపారు. వీటిపై సిఎం కూడా సమీక్ష నిర్వహించారని, పునరావాసులు ఎవరూ నష్టపోకూడదని, ఎవరికీ అన్యాయం జరగకూడదని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్